అర్బన్ ఎస్పీ అవమానించేలా వ్యవహరించారు
తిరుపతి రూరల్ : ఎమ్మెల్యేల నియోజకవర్గ సమీక్షకు పోలీసులు వెళ్లాలన్న నిబంధనలు లేవని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రజా ప్రతినిధులను అవమానించేలా వ్యవహరించారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని ఓ ప్రయివేట్ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తాను తొలిసారిగా నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశానన్నారు. ఈ సమావేశానికి పోలీసు శాఖ నుంచి ఒక్కరుకూడా హాజరు కాలేదన్నారు. ఇదే విషయం ఎస్పీకి ఫోన్ చేసి చెప్పానన్నారు. ఎమ్మెల్యేల సమీక్షకు పోలీసులు రావాల్సిన పనిలేదని, అలాంటి నిబంధనలేమీ లేవని ఎస్పీ తనకు బదులిచ్చారని చెప్పారు. నిబంధనేమీ లేవని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరానన్నారు. నువ్వూ రాతపూర్వకంగా ఇస్తే నేనూ ఇస్తానని ఎస్పీ చెప్పారని తెలిపారు.
ఆ మేరకు తాను ఈ నెల 2 న ఎస్పీకి రాతపూర్వకంగా నియోజకవర్గ సమీక్షకు పోలీసులు ఎందుకు రాలేదో తెలియజేయాలని కోరానన్నారు. ‘ఎమ్మెల్యే నియోజకవర్గ సమీక్షకు పోలీసులు హాజరవ్వాలా... వద్దా’ అనే నిబంధన తనకు తెలియదని, నిబంధనల కోసం డీజీపీకి లేఖ రాశానని ఎస్పీ తనకు రెండువారాల తర్వాత రిప్లై ఇచ్చారన్నారు.
నిబంధనలు తెలియనప్పుడు సమీక్షకు పోలీసులను పంపాల్సిన పనిలేదని ఎందుకు అన్నారో వివరణ ఇవ్వాలన్నారు. ఎస్పీ ప్రజా ప్రతినిధులను అవమానించే విధంగా వ్యవహరించారన్నారు. ఫోన్‌లో ఎస్పీకి తనకు మధ్య జరిగిన సంభాషణను పత్రికలకు చెప్పి వార్తలు రాయించడం ఆయనకు తగదన్నారు. అందుకే ఎస్పీకి, తప్పుడు కథనం రాసిన ఓ పత్రికకు నోటీసులు ఇచ్చానని చెప్పారు.
అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి
ఓటేరు చెరువుని అన్యాక్రాంతం చేసిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పేదలు ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష రూల్స్ చెప్పే అధికారులు అప్పనంగా కోట్ల విలువ చేసే చెరువును కట్టబెట్టడంపై ఆయన మండిపడ్డారు. అవినీతి అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. అవిలాల గ్రామ కంఠంలో ఉన్న ఓటేరు చెరువుకు పట్టాలు ఇవ్వడం వెనుక భారీ మొత్తంలో చేతులు మారాయన్నారు.
పట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చిన స్థలం పక్కాగా చెరువని రెవెన్యూ అధికారులే న్యాయస్థానంలో కేసువేశారని గుర్తు చేశారు. రెండు రోజుల్లో రూ.300 కోట్ల విలువ చేసే చెరువును అమ్మేశారంటే అధికారులు ఏ స్థాయిలో అడ్డదారి తొక్కారో తెలుస్తోందన్నారు. ఓటేరు చెరువు ఒకవేళ చెరువు కాదని తేలితే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్‌చేశారు. ఈ విషయంపై అసెంబ్లీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.