సాక్షి, మంచిర్యాల : విద్యార్థులకు ఉర్దూ విద్య అందని ద్రాక్షగా మారింది. ఉర్దూ విద్యార్థులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తరగతి గదుల కొరత, సొంత భవనాల లేమితో విద్యార్థులు ఇతర మాధ్యమం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆంగ్ల మాధ్యమం వైపు విద్యార్థులను ఆకర్శించేందుకు ప్రతిష్టాత్మకంగా రూ.3 కోట్లతో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు ఉర్దూ మాధ్యమాన్ని విస్మరించడంపై ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఉపాధ్యాయుల కొరత
జిల్లావ్యాప్తంగా 116 ప్రాథమిక, 28 ప్రాథమికొన్నత, 21 ఉన్నత ఉర్దూ మీడియం పాఠశాలలు మొత్తం 165 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 29,133 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 650 పోస్టులు ఉండగా, 582 మంది మాత్రమే ఉన్నారు. 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల నిష్పత్తి ప్రకారం.. ఇంకా కనీసం 1000 మంది ఉపాధ్యాయులు కొరతగా ఉన్నారు. ఉపాధ్యాయులు లేక, బోధన సరిగా జరగక పలు పాఠశాలలు మూతబడే పరిస్థితి ఉంది. ఇంకొన్ని చోట్ల వందల సంఖ్య లో విద్యార్థులుంటే ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. బీరెల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో 103 మంది విద్యార్థులుంటే కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. సారంగాపూర్ యూపీఎస్‌లో 98 విద్యార్థులుంటే ముగ్గురు, మామడ యూపీఎస్‌లో 90 మంది విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. సిబ్బంది కొ రత ఉండడంతో ఉపాధ్యాయులపై పనిభారం ఎక్కువవుతోంది. ఫలితంగా రెండు, మూడు తరగతులకు కలిపి బోధిస్తున్నారు.
అద్దె దిక్కు లేదు..
25 మంది విద్యార్థులుంటే ఓ తరగతి గది నిర్మించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ జిల్లాలో 30 నుంచి 50 మంది విద్యార్థులున్న సుమారు 68 స్కూళ్లలకు సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాల్లోనే తరగతులు కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. సొంత భవనాలు మంజూరు చేయని ప్రభుత్వం అద్దె భవనాలకు కిరాయి చెల్లించేందుకూ మొండికేస్తోంది. దీంతో కొన్ని చోట్ల ఉపాధ్యాయులే తమ జేబులోంచి అద్దె చెల్లిస్తుంటే.. ఇంకొన్ని చోట్ల ఏళ్ల నుంచి అద్దె లేకుండానే ఉర్దూ మీడియం స్కూళ్లు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సొంత భవనాలు లేని పాఠశాలలు 60కిపైనే ఉన్నాయి. మంచిర్యాలలోనే 8 స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్‌లో చాలా స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నిర్మల్ పట్టణం పంజేషా, చిక్కడపల్లి, మోతీనగర్, ఈద్‌గావ్, శాంతినగర్, ఇతర ప్రాంతాల్లో 2007 నుంచి అద్దె లేదు. దీంతో ఇరుకైన గదుల్లోనే ఉపాధ్యాయులు బోధిస్తే.. విద్యార్థులు పాఠాలు వినాల్సి వస్తుంది. మరోపక్క.. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో బోధించేవారు లేక జిల్లాలో ఉర్దూ మీడియం విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైంది. జిల్లాలో ముస్లింల జనాభా ఎక్కువ. ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో కనీసం ఒక్కరినైనా ఉర్దూ మీడియం చదివించేవారు. కానీ ఐదేళ్ల నుంచి ఉర్దూపై పాలకులు చూపుతోన్న వివక్ష.. ప్రైవేట్ ఉర్దూ మీడియం పాఠశాలలు లేకపోవడంతో ముస్లింలు తమ పిల్లలను ఇతర మాద్యమాల్లో చేర్పిస్తున్నారు. ఈ విషయమై డీఈవో కార్యాలయ సంబంధిత సెక్షన్ అధికారి శ్రీహరి బాబు స్పందిస్తూ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు, తరగతి గదుల కొరత ఉన్న మాట వాస్తవమేనని పోస్టుల మంజూరు, గదుల నిర్మాణం ప్రభుత్వం నుంచే రావల్సి ఉందని వివరణ ఇచ్చారు.
పోస్టులు మంజూరు చేస్తేనే..
- వహీద్‌ఖాన్, ఉపాధ్యాయుడు
జిల్లాలో ఉర్దూ మీడియం స్కూళ్లలో బోధకులు, వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర మాధ్యమాల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉర్దూ ఇప్పుడు అంతరించిపోతుంది. జిల్లాలో వందలాది ఉపాధ్యాయ పోస్టులు అవసరమున్నాయి. విడతలుగా అన్నింటినీ భర్తీ చేస్తేనే ఉర్దూ మీ డియం చదివేందుకు విద్యార్థులు ముందుకువస్తారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని నివేదించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది.
వెక్కిరిస్తున్న ఉర్దూ ఉపాధ్యాయుల ఖాళీలు
Published Thu, Aug 15 2013 5:12 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM
Advertisement