
ఉషారాణి ఆత్మహత్య కేసు సీఐడీకి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య కేసును సీఐడీ విచారణకు డీజీపీ సాంబశివరావు శనివారం ఆదేశించారు. కర్నూలు జిల్లా పాణ్యం ఆర్జీఎం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ఉషారాణి కీచక అధ్యాపకుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు.
ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఘటనపై మెరుగైన విచారణ కోసం డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఘటన స్థలాన్ని డీజీపీ పరిశీలించారు.