
'రుణమాఫీ కష్టమని బాబు చెబితే బాగుండేది'
విజయవాడ : రుణమాఫీ కష్టసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్లోనే రైతులకు చెప్పి ఉంటే వారు రుణాలు చెల్లించేవారని,కొత్తవి పొందటంతో పాటు నాలుగు శాతం వడ్డీ సదుపాయం పొందేవారని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా మాఫీ కాలేదన్నారు. బ్యాంకర్లు తమకు ఆదేశాలు రాలేదంటున్నారని, వడ్డీ అపరాధ వడ్డీలు ఎవరు చెల్లించాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పటికీ ఏ స్పష్టత ఇవ్వని చంద్రబాబు.. పెట్టుబడులను ఆకర్షించడానికే సింగపూర్ పర్యటనకు వెళ్లారన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 5 నెలలు కావస్తున్నా ఆ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను తీసుకోవడం సరైన పద్ధతి కాదని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.