వంశీ.. ఆంజనేయులు మధ్య మళ్లీ చిచ్చు
టీడీపీ నేత వల్లభనేని వంశీ, గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు మధ్య చిచ్చు మళ్లీ రేగింది. సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వల్లభనేని వంశీ తాజాగా డీజీపీ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ నక్సల్స్‌తో తనను చంపించాలని ఐజీ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్కౌంటర్ చేసేస్తానని కూడా బెదిరించారన్నారు. తనకు భద్రత కల్పించి, ప్రాణాలు కాపాడాలని ప్రసాదరావుకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన విజయవాడ పోలీసు కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ అపాయింట్‌మెంట్ కూడా వంశీ కోరినట్లు సమాచారం.
అయితే, వంశీ ఫిర్యాదుపై తనకేమీ తెలియదని ఐజీ పీఎస్సార్ ఆంజనేయులు అన్నారు. దానిపై మాట్లాడటానికి ఏమీలేదని ఆయన మంగళవారం హైదరాబాద్లో తెలిపారు. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సీతారామాంజనేయులు.. వల్లభనేని వంశీల మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. అనంతరం బదిలీపై సీతారామాంజనేయులు హైదరాబాద్ వచ్చేశారు.
అయితే, ఖాకీ డ్రస్ వేసుకుని 26 ఎన్కౌంటర్లు చేసిన క్రూరమృగం సీతారామాంజనేయులు అని వంశీ తరపు న్యాయవాది చిరంజీవి వ్యాఖ్యానించారు. బూటకపు ఎన్కౌంటర్లపై సీతారామాంజనేయులపై చర్యలు తీసుకోవాలని గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఆంజనేయులు విజయవాడ సీపీగా ఉండగా మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారని, అది తప్పని ప్రశ్నించిన వంశీపై కక్ష కట్టారని చిరంజీవి ఆరోపించారు. వంశీ చేసిన ఫిర్యాదుపై డీజీపీ ప్రసాదరావు స్పందించారు. లిఖితపూర్వకంగా విజయవాడ సీపీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.