- వైభవంగా గిరిజన దేవతల వనప్రవేశం
- కన్నెపల్లికి చేరిన వెన్నెలమ్మ
- చిలకలగుట్టకు సమ్మక్క
- కోటిమందికిపైగా భక్తుల మొక్కులు
తెలంగాణ కుంభమేళా... మేడారం మహా జాతర శనివారం వైభవంగా ముగిసింది. గిరిజన ఆరాధ్య దైవాలు... భక్తజన ఇలవేల్పులు... వన దేవతలు అయిన సమ్మక్క-సారలమ్మ తల్లుల వనప్రవేశంతో తుది ఘట్టానికి తెరపడింది. అమ్మల దర్శనానికి ముందస్తుగా వచ్చిన భక్తులతో పులకించిన మేడారం... అసలు జాతర నాలుగు రోజుల్లో సరికొత్త శోభను సంతరించుకుంది. జనసంద్రమైన జంపన్నవాగు శివసత్తుల పూనకాలతో హోరెత్తగా... భక్త‘కోటి’ మెక్కులతో తల్లుల ప్రతిరూపాలైన గద్దెలు కిక్కిరిసిపోయూయి. తల్లులు వనమెల్లగా... భక్తులు ప్రణమిల్లారు. భక్తుల తిరుగు ప్రయాణంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది... మన్యం బోసిపోయింది.
సాక్షి, మేడారం : కోటి మంది భక్తుల కొంగుబంగారం.. సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేశారు. మొక్కులు, కానుకలు స్వీకరించిన చల్లని తల్లులు భక్త‘కోటి’కి దీవెనలు అందించి.. తిరుగు పయనమయ్యారు. శనివారం సాయంత్రం 6.01 గంటలకు సమ్మక్క తల్లి వనప్రవేశం చేసింది. సాయంత్రం 6.20 గంటలకు కన్నెపల్లి, కొండాయి, పూనుగొడ్లకు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పయనమయ్యారు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకుంటామని అభయమిస్తూ గిరిజన దేవతలు వనం చేరారు. అమ్మల వనప్రవేశ ఘట్టాన్ని వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు.
సాయంత్రం మొదలైన పూజలు
సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వనప్రవేశ కార్యక్రమం సాయంత్రం 5.49 గంటలకు గిరిజన పూజారుల ప్రత్యేక పూజలతో ఆర్భాటంగా ప్రారంభమైంది. తొలుత సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ఇతర వడ్డెలు గద్దెలపైకి చేరుకున్నారు. అక్కడ గిరిజన ఆచారం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్కను గద్దెలపై నుంచి వడ్డెలు 6.01 బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ వేలాదిగా తరలివచ్చిన భక్తులను దాటుకుంటూ గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లి తల్లిని వన ప్రవేశం చేయించారు. తల్లి వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీర, సారె, బంగారం, పసుపు కుంకుమను స్థానికులు, భక్తులు తీసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.
ముగ్గురు ఒకేసారి
అంతకుముందు పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజు పూజారులు కాళ్లకు గజ్జెలు, నడుముకు దట్టీలు ధరించారు. డోలీలు, బూరలు వాయిస్తుండగా పూజారులు పగిడిద్దరాజు గద్దెపై గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజు గద్దెలపై ఉన్న పడిగెల ను ఎత్తుకున్నారు. ఇదే పద్ధతిలో కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజుల పూజారులు సంప్రదాయం ప్రకారం పూజ లు నిర్వహించి, గోవిందరాజు పడిగెలను ఎత్తుకున్నారు.
సారలమ్మకు పూజలు
గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజలు జరుగుతుండగానే సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పద్ధతుల్లో పూజలు నిర్వహించారు. అప్పటికే గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంది. దీంతో సారలమ్మ పూజలు చివరి దశకు చేరుకోగానే దేవతలు వనప్రవేశానికి సిద్ధమయ్యారు. వనప్రవేశ ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు దారి ఇవ్వాలంటూ మైకుల్లో ప్రకటించారు.
గిరిజన పూజారులు, ఆదివాసీ యువకులు సారలమ్మకు దారి ఇచ్చేలా భక్తులను పక్కకు జరిపారు. సరిగ్గా సాయంత్రం 6.20 గంటలకు సారలమ్మ గద్దె దిగి కన్నెపల్లికి పయనమైంది. అప్పటికే పూజలు పూర్తయి సారలమ్మ కోసం ఎదురుచూస్తున్న పగిడిద్దరాజు, గోవిందరాజులను సారలమ్మను అనుసరిస్తూ గద్దెల ప్రాంగణం వెలుపలికి తీసుకెళ్లారు. దీంతో నాలుగు రోజులపాటు ఘనంగా జరిగిన మహాజాతర ముగిసినట్లయింది.