సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎంలలో డ్రాపవుట్లకు ప్రధాన కారణాలేంటి? ప్రభుత్వం దీని నివారణకు తీసుకుంటున్న చర్యలేంటని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ సమాధానమిస్తూ ఒత్తిడి కారణంగా విద్యార్థులు డ్రాపవుట్ అవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ అందించడం వంటివి అమలు చేస్తున్నట్టు తెలిపారు.
5 వేల కోట్లతో జాతీయ రహదారులు
ఏపీలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో 18 జాతీయ రహదారుల ప్రాజెక్ట్ పనులు చేపట్టినట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధితోపాటు మరో రూ.10 వేల కోట్లతో రెండు వరుసల రహదారుల అభివృద్ధి, కనెక్టివిటీ, రోడ్డు ఓవర్‌బ్రిడ్జ్‌ల నిర్మాణ పనులకు సంబంధించి 38 ప్రాజెక్ట్‌లను చేపట్టినట్లు తెలిపారు.వీటిలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుంచి కృష్ణా నది మీద నిర్మించే వంతెన మీదుగా చినకాకాని వరకు 17.88 కి.మీ. నిర్మించే ఆరు వరుసల బైపాస్ రహదారి ఒకటి. గొల్లపూడి నుంచి చినఅవుటుపల్లి వరకు 30 కి.మీ. మేర నిర్మించే మరో ఆరు వరుసల బైపాస్‌రోడ్డు. హైబ్రీడ్ యాన్యుటీ ప్రాతిపదికపై చేపట్టే ఈ ఆరు వరుసల బైపాస్ రహదారులు గుండుగొలను–విజయవాడ మధ్య నిర్మించే ఆరు లైన్ల రహదారికి అనుసంధానమవుతాయన్నారు.
‘బీమ్స్’ బీచ్‌గా రిషికొండ అభివృద్ధి
విశాఖలోని రిషికొండ బీచ్‌కు మహర్దశ పట్టనుంది. దేశంలోని 13 బీచ్‌లను అంతర్జాతీయ స్థాయి బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రారంభించిన బీచ్ ఎన్విరాన్‌మెంట్–ఈస్థటిక్స్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (బీమ్స్) ప్రాజెక్ట్‌లో రిషికొండ బీచ్‌కు చోటు దక్కినట్లు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు.
నెల్లూరు జిల్లాలో రూ.8,320 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు
నెల్లూరు జిల్లాలో సాగరమాల పథకం పరిధిలో రూ.8,320 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులను గుర్తించినట్టు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంత్రి సమాధానమిచ్చారు. బళ్లారి నుంచి కృష్ణపట్నం జాతీయ రహదారి నిర్మాణంలో ఉందన్నారు.
రూ.4.15 లక్షల కోట్ల మేర పన్నులు వివాదాల్లో ఉన్నాయి
2019 డిసెంబర్ 31 నాటికి మొత్తం రూ.4,15,172 కోట్ల సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్‌కు సంబంధించిన వివాదాలు వివిధ న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు పోచ బ్రహ్మానందరెడ్డి, బీశెట్టి వెంకటసత్యవతి అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సబ్ కా విశ్వాస్ స్కీమ్ ద్వారా ఫిబ్రవరి 5 నాటికి రూ.24,970 కోట్ల విలువైన 49,534 కేసులు పరిష్కరించినట్టు మంత్రి వివరించారు.
ఏపీకి పీఎంజీఎస్‌వై నిధులు పెంచండి
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఏపీకి నిధుల కేటాయింపు పెంచాలని, ప్రస్తుతం ఉన్న 3,285 కి.మీ. మేర రోడ్ల ప్రతిపాదనలను 8 వేల కి.మీ.కు పెంచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి కేంద్రాన్ని కోరారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో 121 కి.మీ. ప్రతిపాదనల నుంచి 659 కి.మీ.కు పెంచాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment