విజ్ఞత లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు
- వైఎస్సార్ సీపీ నేత వంగవీటి రాధా
- సీఎం హుందాగా వ్యవహరించాలి
- శాంతి భద్రతల అంశంలో పట్టుకోల్పోయారు
- ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సీఎంను తిట్టినా పట్టించుకునే పరిస్థితి లేదు
- రాజధానిలో కులమతాల పేరిట కల్లోలం సృష్టించే అవసరం మాకు లేదు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో రంగాపై వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం చంద్రబాబు హుందాగా ఉండాల్సిందిపోయి ఏం జరిగిందో తెలుసుకోకుండా, కనీసం విజ్ఞత కూడా లేకుండా మాట్లాడారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శాంతి భద్రతల సమస్యలు, కులమతాల మధ్య చిచ్చు గురించి నిన్నటి రోజు (మంగళవారం) చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారని, దీనికి సంబంధించి అధికారుల తీరుపై సీఎం కనీసం స్పందించకపోవడం దారుణం.
శాంతి భద్రతల బాధ్యతలను సీఎం గాలికొదిలేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి..’ అని వంగవీటి రాధా డిమాండ్‌చేశారు. అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రాధా చెప్పారు. రంగా అభిమానులు సంయమనం పాటించాలని కోరేందుకు తాను ప్రెస్‌మీట్ పెట్టాలని భావిస్తే.. మొదట అనుమతించిన పోలీసులు తర్వాత వెంటనే అడ్డుకున్నారని, ఎవరి ఆదేశాలతో తమను అడ్డుకున్నారని ప్రశ్నించారు.
ఎవరు తప్పుచేసినా మా పార్టీ ఉపేక్షించదు..
తమ పార్టీలో ఎవరు తప్పుచేసినా చర్యలు తీసుకుంటారని, ఒక నేత రంగాను కించపరిచేలా మాట్లాడితే వెంటనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. కానీ టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఎన్ని తప్పులుచేసినా చర్యలు తీసుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. ‘ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రినే తిడితే పట్టించుకోలేని పరిస్థితి చంద్రబాబుది. అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు దాడులకు దిగినా ఏమీ అనలేని దుస్థితి టీడీపీది. మా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది. అందుకే శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారు. కానీ టీడీపీలో ఆ పరిస్థితి లేదు. అయినా చంద్రబాబు మా పార్టీ గురించి మాట్లాడం హాస్యాస్పదంగా ఉంది’ అని రాధా అన్నారు.
దమ్ముంటే విచారణ జరిపించండి..
‘నేను ప్రెస్‌మీట్ పెట్టడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఒక మహిళ, మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా రత్నకుమారిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే.. ఆ రోజు ఏం జరిగిందనే విషయంపై విచారణ జరపాలి. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మాపట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై త్వరలో మానవ హక్కుల సంఘం, బార్ కౌన్సిల్‌లో ఫిర్యాదుచేస్తాం. అవసరమైతే న్యాయపోరాటానికి వెనుకాడం’ అని రాధా స్పష్టంచేశారు.
కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు..
రాజధానిలో శాంతిభద్రతల సమస్య, కులమతాల చిచ్చుపై సీఎం మాట్లాడుతున్నారని.. ఎన్నో ఏళ్లుగా విజయవాడలో ఉంటున్నామని, కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని రాధా చెప్పారు. శాంతిభద్రతలు అదుపు చేయలేని వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత ఉందా.. అని ప్రశ్నించారు. సమావేశంలో ప్రకాశం జిల్లా పర్చూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల సమన్వయకర్తలు గొట్టిపాటి భరత్, బొప్పన భవకుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బి.విజయ్‌కుమార్, చందన్ సురేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కాజ రాజకుమార్, కార్పొరేటర్లు దామోదర్, ఝూన్సీలక్ష్మి, సుజాత, మాజీ కార్పొరేటర్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు.