
బాధితురాలు - వరదాపురం సూరి
అనంతపురం: తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్చార్జి వరదాపురం సూరి, అతని అనుచరులు తనను కిడ్నాప్ చేసి, కొట్టి, లైంగిక దాడికి ప్రయత్నించినట్లు బాధితురాలు శశికళ ఆరోపించారు. బాధితురాలి కథనం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం వరదాపురం సూరి బెంగుళూరుకు చెందిన శశికళ వద్ద 30 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. బకాయి తీర్చమని ఆమె సూరిని అడుగుతోంది.
బకాయి డబ్బు ఇస్తామని సూరి అనుచరులు ఆమెను బెంగుళూరు నుంచి ధర్మవరం తీసుకువెళ్లారు. సూరి ఆఫీసుకు తీసుకువెళ్లి అక్కడే సాయంత్ర వరకు ఉంచారు. అక్కడే సూరి భార్య కూడా ఉన్నారు. సాయంత్రం శశికళను బత్తలపల్లి శివార్లకు తీసుకువెళ్లి సూరి, అతని అనుచరులు ఆమెపై దాడి చేశారు. ఆమెను తీవ్రంగా గాయపరిచారు. దుస్తులు తీసివేసి ఆమెను లైంగికంగా హింసించారు. సూరి అనుచరులు రాము, చలపతి తనని కొట్టినట్లు ఆమె తెలిపారు. తనపై అత్యారానికి కూడా ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించారు. సూరిపై ఆరోపణలు చేస్తే నీ అంతు చూస్తామని కూడా వారు బెదిరించినట్లు ఆమె చెప్పారు.
ఆ తరువాత శశికళ వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని ఆమె ఎస్పికి ఫోన్లో తెలిపారు. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొదుతున్నారు. ఈ సంఘటన ధర్మవరంలో కలకలం రేపింది.
శశికళ ఆరోపణలపై టిడిపి నేత వరదాపురం సూరి స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మహిళ ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.