ఆహా.. ఏం డ్రామాలు! | Vasireddy Padm Attack on COngress, TDP Leaders | Sakshi
Sakshi News home page

ఆహా.. ఏం డ్రామాలు!

Published Mon, Aug 19 2013 1:51 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

ఆహా.. ఏం డ్రామాలు! - Sakshi

ఆహా.. ఏం డ్రామాలు!

అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరుగుతోందని ముందుగా తెలిసినా నోరువిప్పని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజా ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు సరికొత్త డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.

* కాంగ్రెస్, టీడీపీ నేతలపై వాసిరెడ్డి పద్మ ధ్వజం  
* అడ్డగోలు విభజన గురించి ముందే తెలిసినా నోరు తెరవలేదు
* వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే
* అందరూ చేస్తే రాష్ట్ర విభజన ఆగేది కాదా?
* ప్రజా ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ నాటకాలు
* సోనియా పర్యవేక్షణలో ఆ పార్టీ సూపర్ డైరెక్షన్
* కొత్త పార్టీ అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం
* చంద్రబాబు వైఖరే సీమాంధ్రకు ఉరితాడైంది
 
సాక్షి, హైదరాబాద్: అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరుగుతోందని ముందుగా తెలిసినా నోరువిప్పని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజా ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు సరికొత్త డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. అడ్డగోలు పద్ధతిలో విభజన జరగబోతోందని స్పష్టంగా తెలియగానే ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, అదే బాటలో కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా పయనించి ఉంటే ఈ అడ్డగోలు విభజన ఆగిపోయి ఉండేది కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు సీమాంధ్రలో తీవ్రమైన ఉద్యమ సెగ తమ కుర్చీలను తాకేటప్పటికి సరికొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని ఆమె విమర్శించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో సమావేశమై ఒక బ్రహ్మాండమైన రాజకీయ నాటకం ఆడారని పద్మ విమర్శించారు. ‘సమావేశంలో పాల్గొన్న కొందరేమో కాంగ్రెస్ అధిష్టానవర్గానికి మద్దతుగా మాట్లాడతారు.. ఇంకొందరేమో విమర్శిస్తూ మాట్లాడతారు.. మరికొందరు విమర్శించే వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తారు... ఆ..హహహా..! ఒకే పార్టీలో ఎన్ని గ్రూపులు, ఎందరు పాత్రధారులు.. ఎంతమంది నటీనటులు, ఇంతకంటే సూపర్ డెరైక్షన్ మరొకటి ఉంటుందా? ఇలాంటి డైరె క్షన్ ఒక్క కాంగ్రెస్ పార్టీనే ఇవ్వగలదు. ఈ డ్రామా అంతా సోనియాగాంధీ కనుసన్నల్లో జరగడం లేదా?’ అని ఆమె ప్రశ్నించారు.

వీళ్లంతా రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడ్డానికి ముందు సోనియా మాటను తాము శిరసావహిస్తామని చెప్పినవారేనని అన్నారు. అప్పుడలా శిరసావహించే ఈ రోజు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అలాకాని పక్షంలో సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన రోజునే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి ఉండాలని పద్మ పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రిగా తన అభిప్రాయానికి విలువ లేనప్పుడు ఆయనకు ఏ మాత్రం చీము, నెత్తురు ఉన్నా రాజీనామా లేఖ ఇచ్చి ఉండే వారని చెప్పారు. ఆరోజు సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కనుకనే  ఆయన ఆ పని చేయలేదన్నారు. కానీ సీమాంధ్ర అగ్నిగుండం అవుతోందని గ్రహించాక, పదిరోజుల తర్వాత 10, జన్‌పథ్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించిన సీఎం సీమాంధ్ర ప్రజలపై ప్రేమను ఒలకబోశారని విమర్శించారు.

మంత్రుల భార్యలకున్న చిత్తశుద్ధిని తాము స్వాగతిస్తున్నామని, మంత్రులు మాత్రం సోనియా మాటున దాక్కోవడాన్నే ప్రశ్నిస్తున్నామని పద్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజలు ఓట్లు వేయరని, ఒక్క సీటు కూడా రాదనే భయంతో తాజాగా కొత్త పార్టీ అంటూ మరో డ్రామా మొదలుపెడుతున్నారని తెలిపారు. సీమాంధ్రులను ఢిల్లీలో తాకట్టు పెట్టి ఇక్కడ కొత్త పార్టీ పెడతామంటారా? అని ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ పేరు మీద పార్టీ పెడతామంటూ ప్రజలను మభ్య పెట్టే యోచన చేస్తున్నారని అన్నారు. ఉన్న పార్టీలో గంగిరెద్దులాగా తలూపి సీమాంధ్రులకు తీరని అన్యాయం చేసిన ఈ నేతలు కొత్త పార్టీ పెడతామంటే ప్రజలు మోసపోతారనుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించారు. గొడ్డలితో నరికేది మీరే...మళ్లీ ఆయింట్‌మెంట్ రాస్తున్నట్లుగా మాట్లాడేది మీరేనా...అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓట్లు, సీట్ల కోసం బాబు ఎత్తుగడలు
కాంగ్రెస్‌కు వంత పాడుతూ డ్రామాలు ఆడుతున్న టీడీపీ నేతలను కూడా ప్రజలు క్షమించరని, చీపుర్లతో కాదు.. చెప్పులతో సన్మానిస్తారని పద్మ హెచ్చరించారు. విభజన నిర్ణయం వెలువడినప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కళ్లు రెండూ మూసుకుపోయినట్టుగా ఎందుకు వ్యవహరించారని నిలదీశారు. ప్రధానికి లేఖ రాస్తూ బాబు ఏకరువు పెట్టిన సమస్యలన్నిటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందే లేవనెత్తి భయాందోళనలు వ్యక్తం చేసిందని ఆమె గుర్తు చేశారు.

విభజన నిర్ణయాన్ని స్వాగతించి నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధానిని నిర్మించుకుంటామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాన్ని చూశాక దీన్నుంచి ఎలా లబ్ధి పొందాలి, ఎలా ఓట్లు, సీట్లు సంపాదించాలనే ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. విజయవాడలో దేవినేని ఉమామహేశ్వరరావుతో నిరాహారదీక్ష చేయించడం ఇందులో భాగమేనని ఆమె పేర్కొన్నారు. విజయమ్మ దీక్షకు కూర్చుంటున్నారన్న విషయం ఒకరోజు ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు అప్పటికప్పుడు ఆయనతో అమరణదీక్ష చేయించాలనే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ విషయం దేవినేని స్వయంగా వెల్లడించారని పద్మ చెప్పారు.

విభజన నిర్ణయానికి ముందే టీడీపీ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించి ఉంటే ఆ ప్రక్రియ ఆగిపోయేదని, ఢిల్లీలో ఎప్పుడో చక్రం తిప్పానని పదేపదే చెప్పుకునే బాబు ఎందుకు ఈ విషయంలో బొంగరం కూడా తిప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరే సీమాంధ్ర ప్రజల పాలిట ఉరితాడు అయిందని, కాంగ్రెస్, టీడీపీలు రెండూ కలిసి సీమాంధ్ర ప్రజలను బలిపీఠం ఎక్కించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం జరిగిన ఇన్ని రోజుల తరువాత డ్రామాలాడుతున్నవారికి విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందనే జ్ఞానోదయం ఇప్పుడయ్యిందా? అడ్డగోలు విభజన నిర్ణయాన్ని ముందే గ్రహించి జూలై 25వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ముందుకు రాలేదు? అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీయే ఎప్పటికప్పుడు గళ మెత్తింది..
సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయంపై ఎప్పటికప్పుడు గళం ఎత్తుతూ ముందున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని పద్మ తెలిపారు. అడ్డగోలుగా విభజన కసరత్తు జరుగుతోందని తెలిసి పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సీమాంధ్ర ప్రజలకు జరిగే నష్టాలపై కేంద్ర హోంమంత్రి షిండేకు లేఖ రాశారన్నారు. ఆ తర్వాత పరిస్థితి చేజారుతున్నదని తెలిసి ఈ అన్యాయాన్ని ఆపేందుకు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని చెప్పారు. చివరకు పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మలు కూడా తమ పదవులను త్యజించారని ఆమె వివరించారు.
 
విజయమ్మ దీక్షతో ఉద్యమం మహోధృతం
తెలుగు ప్రజలకు జరుగుతోన్న అన్యాయం చూస్తూంటే అన్నం కూడా సహించడం లేదనే బాధతో విజయమ్మ సోమవారం నుంచి గుంటూరులో చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్ష సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

‘‘కాంగ్రెస్ అధిష్టానం తెలుగు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని వైఎస్సార్ సీపీ ముందుగానే పసిగట్టింది. షిండేకు విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మాట్లాడక ముందే, అడ్డగోలు విభజనను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. కానీ రాష్ట్రానికి  అన్యాయం జరిగిపోయింది. రేపో, మాపో కేంద్రం నిర్ణయం తీసుకుని పార్లమెంటులో దూకుడుగా బిల్లు పెట్టబోతోంది. తెలుగు ప్రజలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూస్తూ అన్నం తినడం మానవత్వం అనిపించుకోదనే ఉద్దేశంతో ప్రజల నేతగా, ప్రజల కోసం పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకురాలిగా విజయమ్మ ప్రాణాలను పణంగా పెడుతూ ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 19 నుంచి జరిగే దీక్షను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తొలుత విజయవాడలో దీక్ష చేయాలనుకుంటే ఎన్నికల నియమావళి ఉందని పోలీసులు అభ్యంతరం తెలిపారు.

అవనిగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేయని వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎన్నికల నియమావళి ఎలా వర్తిస్తుందో ప్రభుత్వం చెప్పడం లేదు. అయినప్పటికీ ఉద్రిక్తతలు సృష్టించడం ఇష్టం లేక తెలుగు ప్రజల పట్ల గల బాధ్యతతో దీక్షా వేదికను విజయమ్మ గుంటూరుకు మార్చుకున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంటుందనే అనుమానాలున్నాయి. రాష్ట్ర విభజనలో జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంలో తొలినుంచీ వైఎస్సార్ కాంగ్రెస్సే ముందుంది. ఇప్పుడు కూడా ముందంజలోనే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement