దర్శి, న్యూస్‌లైన్ : కూరగాయలు భయపెడుతున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో అన్నిరకాల కూరగాయలు కేజీకి *30 పైనే పలుకుతున్నాయి. పేదలు అధికంగా కొనుగోలు చేసే పచ్చిమిర్చి మూడు రోజుల క్రితం వరకూ కేజీ *20 అమ్మగా శుక్రవారం *60కు చేరింది. ఎప్పుడూ లేని విధంగా కాకర కిలో *40కి చేరటం గమనార్హం. పచ్చడి మెతుకులు కూడా తినలేకపోతున్నామని పేదలు వాపోతున్నారు. ఇక మధ్య తరగతి జనం కూరగాయలను పరిమతంగా కొనుగోలు చేసి పొదుపుగా వాడుకుంటున్నారు. ఫ్రిజ్‌ల నిండా కూరగాయలు నింపుకునే రోజులు పోయాయని గృహిణులు ఆవేదన చెందుతున్నారు. కనీసం *200 లేనిదే సంచి నిండటం లేదంటున్నారు. నెల బడ్జెట్‌లో కూరగాయలకు ఇప్పుడు అధికంగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఒకరోజు పప్పు, రెండు రోజులు గుడ్లు వండుకుంటూ ఆదివారం మినహాయించి మిగిలిన రెండు రోజులకు మాత్రమే కూరగాయలు కొంటున్నారు. మరికొద్ది రోజుల్లో కొత్తగా పండిన కూరగాయలు మార్కెట్‌కు రానున్న తరుణంలో ధరలు మండిపోతున్నాయి. తీరా కూరగాయలు మార్కెట్‌కు వచ్చే సరికి ధరలు ఉండటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సమైక్య ఉద్యమం సెగ
ఇటీవల సాగుతున్న సమైక్య ఉద్యమాల ప్రభావం ధరల పెరుగుదలకు ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సకాలంలో లారీలు రావడం లేదనే సాకుతో టోకు వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే లారీలను ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చే క్యారెట్, క్యాలీఫ్లవర్ సక్రమంగా సరఫరా కావటం లేదు.
ఘాటెక్కిన మిర్చి
పచ్చిమిర్చి సరఫరా తగ్గింది. మూడు రోజుల వరకు కేజీ *20 మించని ధర శుక్రవారం దర్శి మార్కెట్‌లో *60 పలికింది. చిల్లర దుకాణంలో పచ్చి మిరపగాయలు అమ్మటం మానుకున్నారు. ధర ఎక్కువగా ఉండటం.. కొనేవారు అంతరేటా అంటుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఊరటనిచ్చిన అల్లం గత వారం వరకు కేజీ అల్లం *250 నుంచి *300 పలికింది. ప్రస్తుతం ధర దిగివచ్చి కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం కిలో *100.
మండుతున్న కూరగాయలు
Published Sat, Aug 10 2013 4:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement