ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలంటూ పెద్దాసుపత్రి మార్చురీ వద్ద ఆందోళన చేస్తున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘మేం దళితులమన్న చిన్నచూపా? ప్రాణాలు పోగొట్టుకున్నా పరిహారం ప్రకటించరా? ఇదెక్కడి అన్యాయం’ అంటూ వెల్దుర్తి ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆదివారం వారు కర్నూలు సర్వజనాసుపత్రి మార్చురీ గేటు వద్ద బైఠాయించారు. వారికి మద్దతుగా తెలంగాణ మాలమహానాడు నాయకులు కూడా కూర్చొన్నారు. ఎక్స్‌గ్రేçషియా ఇచ్చే వరకు మార్చురీ నుంచి మృతదేహాలను తీసుకెళ్లేది లేదంటూ భీష్మించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శనివారం సాయంత్రం వెల్దుర్తి వద్ద తుపాన్ వాహనాన్ని, బైక్‌ను ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ఢీకొట్టడంతో తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన 15 మందితో పాటు వెల్దుర్తికి చెందిన ఒకరు మృతిచెందిన విషయం విదితమే.
వీరి మృతదేహాలకు ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి సొంతూరికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు మూడు, 10 గంటలకు మరో మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయడంతో వాటిని రామాపురం గ్రామానికి ‘మహాప్రస్తానం’ వాహనాల్లో తరలించారు. అంతవరకు బాగానే ఉన్న బాధిత కుటుంబీకులు.. ఎక్స్‌గ్రేషియాపై అధికారులెవరూ నోరు మెదకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, తెలంగాణ ప్రభుత్వం మూడెకరాల భూమితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఎవరూ పలకపోవడంతో తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి మాల శ్రీనివాసులు, ప్రచార రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రవి, నాయకులు లక్ష్మన్న, కృష్ణ, సుచరిత(వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు) ఆధ్వర్యంలో మృతుల బంధువులు «మార్చురీ దగ్గర ధర్నాకు దిగారు. తమకు ఎక్స్‌గ్రేషియాపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇస్తేనే మృతదేహాలను తీసుకెళ్తామని భీష్మించారు.
నాలుగు గంటల పాటు ఆందోళన
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పరిహారాన్ని ప్రకటించడానికి వీలు కాదని, మృతుల కుటుంబ సభ్యులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని కర్నూలు ఆర్డీఓ కె.వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, మాజీ ఎంపీ మందా జగన్నాథం తెలిపారు. నివేదిక పంపితే తమకు న్యాయం జరగదని, ఫలానా చేస్తామన్నది స్పష్టంగా ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని బాధితులు చెప్పడంతో అధికారులకు దిక్కుతోచలేదు. మరోవైపు ముందుగా తీసుకెళ్లిన ఆరు మృతదేహాలను కూడా తెలంగాణలోని శాంతనగర్‌లో నిలిపివేసిన మాలమాహానాడు కార్యకర్తలు.. బాధితులను ఆదుకోవాలని అక్కడ ఆందోళన చేపట్టారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ కలుగజేసుకొని బాధితులకు అన్ని రకాల న్యాయం చేస్తానని ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో మందా జగన్నాథం తెలంగాణ ప్రభుత్వం తరఫున రావాల్సిన ప్రతిపైసా, హామీకి తాను సాక్షిగా ఉంటానని చెప్పడంతో బాధితులు చల్లబడ్డారు. చివరకు మధ్యాహ్నం 1.30 గంట ప్రాంతంలో ధర్నా విరమించడంతో మృతదేహాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment