ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి | Road Accident In Kurnool | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

Published Sat, May 11 2019 6:52 PM | Last Updated on Sat, May 11 2019 10:02 PM

Road Accident In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు, తుఫాన్‌ వ్యాన్‌ ఢీ కొనడంతో 15 మంది మృతి చెందారు. బైక్‌ను తప్పించబోయి ప్రైవేటు బస్సు, తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15మంది దుర్మరణం చెందగా..పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెల్దుర్తి క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులు గద్వాల జిల్లా శాంతినగర్‌ మండలం రామపురం గ్రామస్తులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.  

ఎలా జరిగింది
హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్‌ వోల్వో బస్సు వెల్దుర్తి వద్ద బైక్‌ను తప్పించబోయి.. గద్వాల వైపు వస్తోన్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఎదురుగా వస్తోన్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్‌ను దాటి అటువైపుగా వస్తోన్న తుఫాన్‌ వాహనాన్ని వోల్వో బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనం ప్రయాణిస్తున్న 15 మందిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వారిలో ఒకరు మృతి చెందగా,మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో తుఫాన్‌ వాహనం నుజ్జునుజ్జవ్వడంతో వారిని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది.రహదారి అంతా రక్త మరకలతో నిండిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా..
పెళ్లి చూపుల కోసం రామపురంకు చెందిన 15 మంది శనివారం ఉదయం తుఫాన్‌ వాహనంలో గుంతకల్లు వెళ్లారు. నిశ్చితార్థం ముగించుకొని సొంత గ్రామానికి వస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. వీరంతా బంధువులేనని, అయితే ఒకే కుటుంబానికి చెందినవారా? కాదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతి చెందిన వారిని  గద్వాల జిల్ల రామపురంకు చెందిన గోపి, తిక్కయ్య, చింతలన్న, నాగరాజు, చిన్నసోమన్న, భాస్కర్, పగులన్న, రగ్బన్న, విజయ్‌గా గుర్తించారు. మరికొంత మంది పేర్లు తెలియాల్సి ఉంది.

సీఎం కేసీఆర్‌, చంద్రబాబు దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సంఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ను కేసీఆర్‌ ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని చంద్రబాబు కర్నూలు ఆసుపత్రి వైద్యులకు సూచించారు.



వైఎస్‌ జగన్‌ సంతాపం
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కర్నూలుకు పయణమైన కలెక్టర్
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న జోగులాంబ గద్వాల కలెక్టర్‌  కె.శశాంక, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ‌ కేపి‌ లక్ష్మీనాయక్ తో కలిసి కర్నూల్ ఆసుపత్రికి బయలుదేరారు. ఒకే గ్రామానికి చెందిన 15 మంది దుర్మరణం చెందడంతో రామాపురంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మృతులు వీరే

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారు గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
1)పౌలు(45)
2)చింతలన్న(60)
3)తిక్కన్న(38)
4)నాగరాజు(35)
5)పరుశారముడు(28)
6)విజయ్(26)
7)చిన్న సోమన్న(43)
8)భాస్కర్(41)
9)గోపీనాథ్(21)
10)రాముడు(41)
11)సురేష్(28)
12)మునిస్వామి(35)
13)కటిక మసూం
14)వెంకట్ రాముడు(35)
15)రంగ స్వామి(45)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement