సాక్షి, ఆదోని : పెళ్లి దుస్తులు తీసుకుని తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమార్తె అన్న మృతి చెందాడు. తండ్రితో పాటు మరో ఆరుగురు బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి కుమార్తె స్వల్పగాయాలతో బయటపడింది. ఈ సంఘటన బుధవారం బిణిగేరి-విరుపాపురం మధ్య పొలిమేరమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. డీఎస్పీ రామకృష్ణ, క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన మద్దికెరలోని మద్దమ్మ బావి వీధిలో నివాసముంటున్న కొట్రేష్, అన్నపూర్ణమ్మ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు.
కుమార్తె సుమలతకు ఎమ్మిగనూరుకు చెందిన వినోద్‌కుమార్‌తో వచ్చే నెల 14,15న పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి దుస్తుల కోసం బుధవారం పెళ్లికుమార్తెతో పాటు తండ్రి కొట్రేష్, అన్న సూరిబాబు, బంధువులు మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణ ఓమ్నీ వ్యానులో ఆదోనికి వచ్చారు. పెళ్లి దుస్తులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బిణిగేరి-విరుపాపురం మధ్య పొలిమేరమ్మ గుడి సమీపంలో వ్యాను రోడ్డు పక్కన నిలిపారు. అంతలో ఎదురుగా వస్తున్న ఎంహెచ్46 ఎఫ్4883 నంబరు గల బండల లారీ టైర్ పగిలి వ్యాన్‌ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తె తండ్రి కొట్రేష్, అన్న సూరిబాబు, బంధువులు మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణ తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి కుమార్తెకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. సూరిబాబు మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొట్రేష్ పరిస్థితి విషమంగా ఉంది. మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. ప్రత్యక్ష సాక్షి అయిన సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆస్పరి పోలీసులు తెలిపారు. ఆదోని డీఎïస్పీ రామకృష్ణ, తాలూకా ఎస్‌ఐ రామంజులు ఆస్పత్రికి చేరుకుని.. ప్రమాదం వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment