వెలిగొండ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో ‘సాక్షి’ చెప్పిందే జరిగింది. హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ రెండో టన్నెల్(సొరంగం) టెండర్లలో అధికారులు శుక్రవారం ఫైనాన్స్(ఆర్థిక) బిడ్ తెరిచారు. 4.65 శాతం ఎక్సెస్‌కు(అదనపు ధర) టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఆ సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు వెలిగొండ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ జబ్బార్ నివేదిక పంపారు. కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యేలా ముఖ్యనేత చక్రం తిప్పడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ ఎత్తున భారం పడింది. ఈ వ్యవహారంలో ముఖ్యనేత రూ.కోట్లలో లబ్ధి పొందనున్నారు.
వ్యూహం ప్రకారమే ఎల్–1గా రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్
వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులకు ఏప్రిల్ 26న నిర్వహించిన టెండర్లలో అక్రమాలను ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. మే 8న మళ్లీ టెండర్లు పిలిచింది. ఈ పనులను ఎలాగైనా సీఎం రమేశ్‌కు అప్పగించాలని ముందే నిర్ణయించిన ముఖ్యనేత కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యేలా చక్రం తిప్పారు. ఫలితంగా తన కోటరీలో ప్రధాన కాంట్రాక్టర్ అయిన సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్, నవయుగ, పటేల్ ఇంజనీరింగ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇది గతనెల 24న తెరిచిన టెక్నికల్ బిడ్‌లో వెల్లడైంది.
శుక్రవారం తెరిచిన ఫైనాన్స్ బిడ్‌లో లాలూచీ పర్వం బహిర్గతమైంది. సీఎం రమేశ్ సంస్థ 4.65 శాతం ఎక్సెస్‌కు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిస్తే.. నవయుగ 4.87 శాతం ఎక్సెస్‌కు బిడ్ దాఖలు చేసి ఎల్–2గా, పటేల్ సంస్థ 4.91 శాతం ఎక్సెస్‌కు బిడ్ దాఖలు చేసి ఎల్–3గా నిలివడమే కుమ్మక్కు పర్వానికి నిదర్శనం. తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన సీఎం రమేశ్ సంస్థకు పనులు అప్పగించాలని వెలిగొండ చీఫ్ ఇంజనీర్ సీవోటీకి ప్రతిపాదనలు పంపారు. సీవోటీ ఆమోదం తెలపడమే తరువాయి.. ఆ పనులను సీఎం రమేశ్ సంస్థకు అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment