సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ టెండర్ల వివాదం నుంచి గట్టెక్కేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అదిరిపోయే ప్లాన్ వేసింది. పనులను పాత కాంట్రాక్టర్‌కే సబ్ కాంట్రాక్టుకు అప్పగించడం ద్వారా టెండర్ల వివాదానికి చెక్ పెట్టడంతోపాటు తట్టెడు మట్టెత్తకుండానే రూ.200 కోట్లకు పైగా లబ్ధి పొందడానికి వ్యూహం రచించింది.
4.65 అధిక ధరలకు టెండర్
వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా రెండో టన్నెల్‌ను 18.838 కి.మీ.ల పొడవున తవ్వే పనులను రూ.735.21 కోట్లకు హెచ్‌సీసీ–సీపీపీఎల్(జాయింట్ వెంచర్) సంస్థ 2007లో దక్కించుకుంది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం 2012 నాటికే ఈ పనులు పూర్తి కావాలి. కానీ 2015 వరకూ పూర్తి కాలేదు. 2016 డిసెంబర్ నాటికి ఈ టన్నెల్ పనులు పూర్తి చేయాలనే సాకు చూపుతూ అదేఏడాది జూలై 5న కాంట్రాక్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా రూ.17.29 కోట్లను ప్రభుత్వం ఇచ్చేసింది. అయినా టన్నెల్ పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండో టన్నెల్ పనులు పూర్తి చేయాలనే నెపంతో మిగిలిపోయిన పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వం తొలగించింది.
ఈ పనుల విలువను రూ.299.48 కోట్లుగా ఐబీఎం తేల్చింది. కానీ, ముఖ్యనేత ఒత్తిడి మేరకు అంచనా వ్యయాన్ని పెంచేస్తూ మార్చి 22న జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన అంచనా వ్యయంతో చేపట్టే పనులను సీఎం రమేశ్ సంస్థకే అప్పగించాలని ముఖ్యనేత నిర్ణయించారు. ఈ పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చి నెలలో సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 4.65 శాతం అధిక ధరలకు సీఎం రమేశ్ సంస్థ టెండర్ దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినకుండా 60సీ నిబంధన కింద తమపై వేటు వేసిందంటూ పాత కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో పాత కాంట్రాక్టర్ వాదనను విని, లెక్కలు తేల్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం), క్వారీ, చేసిన పనులకు అదనపు బిల్లులతో కలిపి రూ.185 కోట్లు పరిహారంగా ఇవ్వాలని పాతకాంట్రాక్టర్ ప్రతిపాదించారు. లేకపోతే పెంచిన అంచనా వ్యయం మేరకు బిల్లులు ఇస్తే ఆ పనులు తామే చేస్తామని పేర్కొన్నారు.
పాత కాంట్రాక్టరే సబ్ కాంట్రాక్టర్
టెండర్ల వివాదం నుంచి గట్టెక్కడంతోపాటు భారీగా లబ్ధి పొందడానికి సీఎం రమేశ్ మాస్టర్ ప్లాన్ వేశారు. టన్నెల్ పనులను సబ్ కాంట్రాక్టు కింద ఇస్తామని.. వాటి పాత విలువ అంటే రూ.299 కోట్లకు అదనంగా ఇంకో రూ.70 కోట్లు ఇస్తామని, వాటిని మీరే చేసుకోవాలని పాత కాంట్రాక్టర్‌కు ప్రతిపాదించారు. ఇందుకు పాత కాంట్రాక్టర్ అంగీకరించినట్లు తెలిసింది. దీనివల్ల పనులు చేయకుండానే రూ.200 కోట్లకుపైగా ప్రయోజనం పొందడానికి సీఎం రమేశ్ పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది.
అధికార పార్టీ ఎంపీ అంటే అంతేమరి!
Published Sun, Aug 19 2018 3:49 AM | Last Updated on Sun, Aug 19 2018 3:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment