ఫ్లైయాష్ ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం
ఆర్టీపీపీలో నిత్యం దాదాపు 4 వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి.. సిమెంట్ పరిశ్రమలు, ప్రైవేట్ కంపెనీలకు సరఫరా
కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే రవాణా
తమకే దక్కాలంటూ జేసీ, ఆది వర్గాల పట్టు
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి.
తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
⇒ వైఎస్సార్ కడప జిల్లాలోని ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) నుంచి నిత్యం 3,926 టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుండగా 25 ప్రైవేట్ కంపెనీలు, 15 సిమెంటు పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు టన్ను రూ.550 చొప్పున, సిమెంట్ పరిశ్రమలకు టన్ను రూ.410 చొప్పున సరఫరా అవుతోంది. అయితే రవాణా మాత్రం కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది. తాడిపత్రిలో ఉన్న ఎల్ అండ్ టీ సిమెంట్ పరిశ్రమకు జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ట్యాంకర్లు ఫ్లైయాష్ సరఫరా చేస్తున్నాయి.
అయితే సిమెంట్ పరిశ్రమలకు తామే ఫ్లైయాష్ సరఫరా చేస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. ఈ క్రమంలో తాడిపత్రికి కూడా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేశారు. అందుకు అందుకు నిరాకరించిన జేసీ తమ లారీల ద్వారానే తరలిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జేసీ లారీలను నాలుగు రోజుల క్రితం అడ్డగించారు.
⇒ ‘ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ సరఫరాను అడ్డుకుంటే తాడిపత్రికి వాళ్ల లారీలు వచ్చి వెళ్తాయా? తమాషాలు చేస్తున్నారా? ఎలా అడ్డుకుంటారో చూద్దాం. నేనే వస్తున్నా...’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించడంతో అప్రమత్తమైన పోలీసులు కొండాపురం మండలం సుగమంచుపల్లె నుంచి కలమల్ల వరకూ మూడు చోట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కలమల్ల ఆర్టీపీపీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. జేసీ తన వాహనాలతో వస్తే అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం సిద్ధం కావడంతో ఉదయం ఉద్రిక్తత నెలకొంది.
మొన్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌పై కూడా..
అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు సివిల్ పనులను చేస్తున్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు తాజాగా దాడి చేయడం తెలిసిందే. కాంట్రాక్టు పనులన్నీ తామే చేస్తామని డిమాండ్ చేయడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తాజాగా ఫ్లైయాష్ సరఫరా విషయంలో రగడ మొదలైంది.
ఆదాయ మార్గాలపై ఆదినారాయణరెడ్డి వర్గం కన్నేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆర్టీపీపీ నుంచి సరఫరా చేసే ఫ్లైయాష్‌కు ప్రతి నెలా ఒక్కో లారీకి రూ.లక్ష కమీషన్ ముట్టజెప్పనున్నట్లు సమాచారం. ఎన్ని వాహనాలు తిరిగితే అంత కమీషన్ లభించనుంది. దీంతో రవాణాపై ఇరువర్గాలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయాన్ని వదులుకునేందుకు అటు జేసీ ప్రభాకరరెడ్డి, ఇటు ఆదినారాయణరెడ్డి వర్గం సిద్ధంగా లేదు.
ఆర్టీపీపీలో పోలీసులకు సూచనలిస్తున్న పోలీసు అధికారులు
అదానీలా ఊరుకోను
– ఎస్పీకి జేసీ లేఖ
ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ తరలించే తమ వాహనాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్‌రెడ్డి అడ్డుకుంటే సహించేది లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు కడప ఎస్పీకి మంగళవారం ఆయన లేఖ రాశారు. అక్టోబరు 15న ఆర్టీపీపీ వద్ద తమ వాహనాలను అడ్డుకోవడంపై ఎస్పీ, జమ్మలమడుగు ఎస్‌డీపీఓల దృష్టికి తెచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
భూపేష్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో తాము ఈనెల 23న కడప నుంచి వచ్చే సిమెంటు, ఇసుక అక్రమ రవాణా వాహనాలను నిలిపి వేసినట్లు చెప్పారు. కడప ఎస్పీ విజ్ఞప్తి మేరకు ఆ రోజు వాటిని వదిలి వేశామన్నారు. ఈనెల 25 నుంచి ఫ్లైయాష్ లోడింగ్‌కు తమ వాహనాలను అనుమతిస్తామని తాడిపత్రి రూరల్ ఇన్‌స్పెక్టర్ హామీ ఇచ్చారన్నారు. అయినా కూడా ఒక రోజు అదనంగా గడువు ఇచ్చామన్నారు.
బుధవారం నుంచి లోడింగ్‌కు తమ వాహనాలు ఆర్టీపీపీకి వెళతాయని, ఈ దఫా కూడా అడ్డుకుంటే తేలికగా తీసుకోబోమని స్పష్టం చేశారు. తాము రాత్రికి రాత్రే రాజకీయ నాయకులుగా అవతరించలేదన్నారు. తమ కుటుంబం 1932 నుంచి రాజకీయాల్లో కొనసాగుతోందన్నారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారన్నారు.
ఈ దఫా తాము కచ్చితంగా ప్రతిస్పందిస్తామని, ముందుగానే ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే బీజేపీలో చేరారని, వైఎస్సార్ సీపీ హయాంలో తనపై 95 అక్రమ కేసులు బనాయించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment