
శ్రీవారు.. ‘సిరి’వారు
♦ రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం
♦ ఈ ఏడాది రూ. వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరుని హుండీ ఆదాయం ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ఆదాయం చరిత్రలో తొలిసారిగా రూ. వెయ్యి కోట్లు దాటింది. 2015-2016 వార్షిక బడ్జెట్‌లో రూ. 905 కోట్లు మాత్రమే రావచ్చని అంచనా వేయగా ఇప్పటికే రూ. 1,010 కోట్లు వచ్చాయి. 2003-2004 వార్షిక బడ్జెట్ రూ. 590 కోట్లు ఉండగా పదమూడేళ్ల తర్వాత సుమారు నాలుగున్నర రెట్లతో 2016-2017కు రూ. 2,678 కోట్లకు పెరిగింది. అలాగే హుండీ ఆదాయం అప్పట్లో రూ. 227 కోట్లు ఉండగా ప్రస్తుతం సుమారు ఐదు రెట్లు రూ. 1,010 కోట్లకు పెరిగింది. అలాగే అప్పట్లో 2003-2004లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ సుమారు రూ. 50 కోట్లు ఉండగా (డిపాజిట్లు సుమారు రూ.12వేల కోట్లు), 2016-2017 ఆర్థిక సంవత్సరానికి 15 రెట్లు పెరిగి రూ. 778.93 కోట్లు రావచ్చని అంచనా వేశారు.
రూ. 1.34 లక్షలతో మొదలై...
1951 నవంబర్ నెల మొత్తంగా స్వామివారికి ఆలయ హుండీ ద్వారా లభించిన కానుకలు 1,34,256 రూపాయల 9 అణాల 11పైసలు మాత్రమే. ప్రస్తుతం రోజుకు రూ. 2 నుంచి 3 కోట్లు దాటుతుండటం విశేషం. ఏప్రిల్, మే నెలల్లో హుండీ ద్వారా నెలకు రూ. 80 కోట్లు లభిస్తుండగా, మిగిలిన నెలల్లో సరాసరిగా రూ. 55 నుంచి రూ. 60 కోట్లు లభిస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు లభిస్తుండటం ఇటీవల పెరిగింది. ఆర్థిక సంవత్సరం చివరి నె లలైన ఫిబ్రవరి, మార్చిలో ఆదాయ పన్ను పద్దులు చూపించే సమయం కావటం వల్ల సంపన్నులు ఆ మొత్తాలను హుండీలో సమర్పిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.
పసాదాల ధరలు పెంచబోం
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ధరల పెరుగుదల కారణంగా తిరుమల లడ్డూ, ఇతర ప్రసాదాల ధర కూడా పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ధరలు పెంచబోమని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. ఆదివారమిక్కడ శ్రీ వేంకటేశ్వర కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళ నానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ ధర తక్కువగా ఉండటం వల్ల టీటీడీపై ఏటా రూ. 160 కోట్ల భారం పడుతోందని చెప్పారు. ఆర్జిత సేవల టిక్కెట్ల ధరలు కూడా పెంచాలన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. వీటిపై భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అలాగే టీటీడీ అందిస్తున్న కొన్ని ఉచిత సౌకర్యాలను భక్తులు వినియోగించుకోవడం లేదని, అలాంటి వాటిని తొలగించడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకుంటామని తెలిపారు. ఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో బాలికలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. టీటీడీ అనుబంధ విద్యాసంస్థలకు కూడా భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తామన్నారు. సిబ్బంది పిల్లలకు టీటీడీ విద్యాసంస్థల్లో ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.