
సాక్షి, హైదరాబాద్ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆగస్టు 9 నుంచి 17 వరకూ నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేసి టీవీల్లో ప్రసారం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఓ న్యాయవాది హైకోర్టును కోరారు. గురువారం ఉదయం హైకోర్టు ప్రారంభమైన వెంటనే ఆయన లేచి.. మహా సంప్రోక్షణను వీడియో చిత్రీకరణ చేసేలా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోటులో తవ్వకాలపై పిటిషనర్ ఇప్పటికే వ్యాజ్యం దాఖలు చేశారని, దానికి అనుబంధంగా మహా సంప్రోక్షణ గురించి పిటిషన్ వేస్తామని న్యాయవాది చెప్పారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం అందుకు అనుమతి ఇచ్చింది. ఒక్కో ఆలయంలో ఒక్కో విధానాన్ని అమలు చేస్తారని, వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశాలు ఎలా ఇస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. స్వామి వార్ల విగ్రహాలు కూడా ఉంటాయని, దార్మిక కార్యక్రమాలపై ఏవిధంగా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తామని పిటిషనర్ కోరగా అందుకు ధర్మాసనం అనుమతి ఇస్తూ, దానిపై ఈ నెల 24న విచారణ చేస్తామని తెలిపింది.