విద్యతోనే అభివృద్ధి సాధ్యం
ఉదయగిరి : వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి సాధించాలన్నా, మానవుడు మనగడ సాధించి అభివృద్ధి సాధించాలన్నా అది విద్యతోనే సాధ్యమవుతుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం స్థానిక మెరిట్స్ కళాశాల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్‌పో 2కె-15 కార్యక్రమంలో మాట్లాడారు.
ఉదయగిరి ప్రాంత విద్యార్థుల ప్రతిభను గుర్తించి వెలికి తీసేందుకు మెరిట్స్ కళాశాల యాజమాన్యం 2013 నుంచి సైన్స్ ఎక్స్‌పో కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భారత అంతరిక్ష శాస్త్రంలో ఇస్రో ప్రపంచ దేశాల కంటే తక్కువ ఖర్చుతో సాధించిన సైన్స్ విషయాల గురించి విద్యార్థులకు వివరించి వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు సైన్స్‌పై విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించి ప్రతిభా పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు.
అనంతరం ఆయన కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 156 సైన్స్ ప్రదర్శన నమూనాలను సందర్శించారు. విద్యార్థులను ప్రశ్న లు అడిగి వారి జిజ్ఞాసను తెలుసుకుని వారి లో ఉత్తేజం నింపారు. అంతకుముందు ఆయన సైన్స్ ఎక్స్‌పోను ప్రారంభించి సరస్వతీ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎంపీ వెంట కళాశాల గౌరవ డెరైక్టర్ డాక్టర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, ప్రిన్సిపల్ పి.జయరామిరెడ్డి తదితరులున్నారు.