విద్యతోనే అభివృద్ధి సాధ్యం: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, సిటీబ్యూరో: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మజ్లిస్ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో శనివారం ఉర్దూ మీడియం విద్యార్థినిలకు ప్రతిభా పురస్కారాలు, పదవ తరగతి పరీక్ష ఫీజు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో విద్యతోనే అన్ని రంగాలు ముడిపడియున్నాయని, విద్యను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
బాలల కంటే బాలికలే అత్యధికంగా ప్రతిభ కనబర్చుతారని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో రాణించాలనే తపనకలిగిన ప్రతిభావంతులకు సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో ఎస్‌ఎస్‌సీ టాపర్లుగా నిలిచిన 556 మంది విద్యార్ధులకు నగదు అవార్డులు అందజేశారు. నగరంలోని 86 ఉర్దూ మీడియం పాఠశాలకు సంబంధించి 2024 మంది విద్యార్థినిలకు పదవతరగతి పరీక్ష ఫీజును అందజేశారు.
అదేవిధంగా ఎస్‌ఎస్‌సీలో వంద శాతం ఫలితాలు సాధించిన మూడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పాషాఖాద్రీ, ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, జాఫర్ హుస్సేన్, మౌజం ఖాన్, మొహీయెద్దీన్, బలాల, ఎమ్మెల్సీలు జాఫ్రీ, రజ్వీ తదితరులు పాల్గొన్నారు.