చదువుతోనే అభివృద్ధి
ఆత్మకూరు: ‘చదువు జాతి సంపద. ప్రతి బిడ్డా చదువుకోవాలి. చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామాన్ని ఎంపీ దత్తత తీసుకున్నారు. స్థానిక సర్పంచ్ హజరత్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎంపీ ప్రసంగించారు. ప్రస్తుతం తాను ఈ దశలో ఉన్నానంటే అందుకు కారణం చదువకోవడమేనని గుర్తు చేశారు. తాను కంపసముద్రం గ్రామాన్నే దత్తత తీసుకోవడానికి గల కారణాలను వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనను ప్రవేశపెట్టి ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రకటించారన్నారు. ఇందులో స్వగ్రామాన్ని తీసుకునే వీలులేనందున బ్రాహ్మణపల్లిని దత్తత తీసుకోలేకపోయానన్నారు. ఐదో తరగతి వరకు బ్రాహ్మణపల్లిలో చదివితే.. ఆ తరువాత 8 వరకు కంపసముద్రంలో చదువుకున్నట్లు తెలిపారు.
అందుకే తాను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ జిల్లాలోని పుట్టంరాజువారికండ్రిగను దత్తత తీసుకొని రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు కోసం నిధులు కేటాయించారన్నారు. కలెక్టర్ కూడా మరో రూ.3 కోట్లు అందజేశారన్నారు.
అయితే రాజ్యసభ సభ్యులు అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయకపోయినా ఎవరూ అడగరన్నారు. అందుకే వారికి కేటాయించిన నిధులన్నీ ఒకే గ్రామానికి వినియోగించవచ్చన్నారు. పార్లమెంటు సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలకు కలెక్టర్ తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను ఆధారంగా తీసుకుని ప్రధానంగా మహిళలు జీవనం సాగిస్తున్నారని, పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో నరేంద్రమోదీ భూసార పరీక్షలను నిర్వహించి ఆయా భూములకు సరిపడా పంటలను పండించేలా పథకాలను రూపొందించారన్నారు. అదే తరహాలో అన్ని ప్రాంతాలను భూసార పరీక్షలను చేపట్టడం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కంపసముద్రంలో 10 శాతం కుటుంబాలకు కూడా మరుగుదొడ్లు లేవన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా
- బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జెడ్పీచైర్మన్
గ్రామాల అబివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. కంపసముద్రంలోని ఉన్నత పాఠశాలలో మూడు గదుల నిర్మాణానికి పంచాయతీ భవనం, పీహెచ్‌సీ సబ్‌సెంటర్, బోర్లు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న 100 పడకల ఆసుపత్రి అంతర్గత రహదారులకు నిధులు మంజూరు చేసి ఆసుపత్రిని త్వరితగతిన ప్రారంభించేలా కృషి చేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయానికి భవనం మంజూరైందని, త్వరితగతిన నిర్మాణాలు చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ కార్యాలయం భవనాన్ని కూడా నిర్మించాలన్నారు. ఆత్మకూరు, చేజర్ల మార్గంలోని బ్రిడ్జి, పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను కూడా త్వరితగతిన చేపట్టాలని కోరారు. అధికారులు న్యాయబద్దంగా పనిచేయాలి
- మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే
అధికారులు రాజకీయాలకు అతీతంగా, న్యాయబద్ధంగా పనిచేయాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. కంపసముద్రం గ్రామాన్ని ఎంపీ దత్తత తీసుకోవడం హర్షణీయమన్నారు. తాను పాదయాత్ర చేపట్టి అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు దత్తత గ్రామాలు ఎంపిక ఓ మంచి పరిణామమన్నారు.
ఆత్మకూరు పరిధిలో తాగు, సాగునీరు సమస్య అధికంగా ఉందన్నారు. ఈ సమస్యను తీర్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికీ సాయపడాలని ఆయన అధికారులను కోరారు. ప్రజల మన్ననలు పొందేలా అధికారులు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కక్షలు, కుట్రలు పనికి రావన్నారు.
గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
- కలెక్టర్ ఎం.జానకి
గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎం.జానకి కోరారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద జిల్లాలో నాలుగు గ్రామాలు ఎంపికయ్యాయన్నారు. కంపసముద్రం గ్రామాన్ని ఎంపీ రాజమోహన్‌రెడ్డి, పుట్టంరాజువారి కండ్రిగను సచిన్‌టెండూల్కర్, పెళ్లకూరు, వెంకటాచలం మండలంలోని రెండు గ్రామాలను తిరుపతి ఎంపీ వరప్రసాద్ దత్తత తీసుకున్నారని తెలిపారు.
జిల్లాలో 940 గ్రామ పంచాయతీలు, 218 గ్రామాలను, 218 వార్డులను అభివృద్ది చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, సాగు నీరు కూడా పలు ప్రాంతాల్లో లేకపోవడాన్ని గుర్తించినట్లు తెలిపారు. మెట్ట ప్రాంతాల్లో ఉద్యాన పంటలను సాగుచేస్తే మంచిదన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే కాకుండా గ్రామంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటే స్మార్ట్ విలేజ్‌లోని 20 అంశాలు సాధ్యమవుతాయన్నారు. అందుబాటులో ఉండి సహకరిస్తాం
- ఎం.వెంకటరమణ, ఆర్డీఓ
కంపసముద్రం దత్తత గ్రామ ప్రత్యేకాధికారిగా అన్ని వేళలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని ఆర్డీఓ ఎం.వెంకటరమణ తెలిపారు. కంపసముద్రంలో 557 గృహాలు ఉన్నాయన్నారు. ఈ 20 సూత్రాలు అమలు చేస్తూ స్మార్ట్ గ్రామంగా రూపొందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సర్వే నిర్వహించామని, తదుపరి సమావేశంలో ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు.
అంతకముందు చుంచులూరు గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీసుకున్న మర్రిపాడు మండలాధ్యక్షుడు రమణయ్య, అతని సహచరుడు చిట్టిని ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. కంపసముద్రం గ్రామ సర్పంచ్ హజరత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో మండలాధ్యక్షులు రమణయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు చంద్రకళ, జిల్లా అధికారప్రతినిధి మల్లు సుధాకర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి, జెడ్పీ సీఈఓ జితేంద్ర, డ్వామా పీడీ గౌతమి, పాల్గొన్నారు.