బి.కొత్తకోట మండలం శీతివారిపల్లె వద్ద రైల్వేఅండర్ టన్నల్ పనులు పరిశీలిస్తున్న విజిలెన్స్ ఎస్పీ, ఎస్‌ఈ
సాక్షి, బి.కొత్తకోట: గత టీడీపీ ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో జరిగిన హంద్రీ–నీవా ప్రాజెక్టు కాలువలు, కాంక్రీటు, సొరంగం, అండర్ రైల్వే టన్నెల్ పనులపై బుధవారం విజయవాడ, తిరుపతికి చెందిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య, విజయవాడ నుంచి ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, డీఈ నాగసురేష్, ఏఈలు సౌజన్య, ప్రకాష్, రామ్మోహన్‌ల బృందం విస్తృతంగా విచారణ, పరిశీలనలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో 27వ ప్యాకేజి (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) విలువ రూ.72.73 కోట్ల పనిలో మిగిలిన రూ.1.16కోట్ల పనిని రూ.9 కోట్లకు, 28వ ప్యాకేజీ (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) పని విలువ రూ.83.80కోట్లలో మిగిలిన రూ.78 లక్షల పనిని రూ.3.69కోట్లకు అంచనాలు పెంచి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తొలుత బి.కొత్తకోట మండలంలో 27, 28 ప్యాకేజీల్లో జరిగిన పుంగనూరు ఉపకాలువ, శీతివారిపల్లె సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ టన్నల్ పనులను క్షణ్ణంగా పరిశీలించారు.
బి.కొత్తకోట మండలంలోని జాతీయ రహదారికి సమీపంలో శీతివారిపల్లె వద్ద పాకాల –ధర్మవరం రైల్వే మార్గం వెళ్తోంది. ఈ మార్గం దాటి పుంగనూరు ఉపకాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే రైల్వే మార్గం కారణంగా రైల్వే లైను కింద సొరంగం పనులు చేసి ఇరువైపులా కాలువను కలిపే పనులు చేశారు. ఈ పనుల్లో భాగంగా కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేసినట్టు రికార్డుల్లో ఉంది. 27 ప్యాకేజీ పనుల్లో మిగిలిన పనిని 60సీ కింద తొలగించి, 28వ ప్యాకేజీ పరిధిలో వచ్చే కాంక్రీటు నిర్మాణాలు, సొరంగం పని కలిపి 60సీ కింద తొలగించి రూ.3.26 కోట్లకు టెండర్ పనిని అప్పగించారు. ఇందులో 1500 క్యూబిక్ మీటర్ల కంట్రోల్ బ్లాస్టింగ్ పనులుచేశారు. ఈ పనులు వాస్తవంగా చేశారా లేక అనవసరంగా చేయించారా.. అన్న కోణంలో పరిశీలించారు.
అనంతపురం సరిహద్దులో పెద్దతిప్పసముద్రం మండలం మీదుగా బి.కొత్తకోట మండలంలో సాగే 27వ ప్యాకేజీ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం కురబలకోటలో జరిగిన పనులు, ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తూ మదనపల్లె సమీపంలోని సొరంగం చేరుకున్నారు. 59వ ప్యాకేజీలోని ఈ సొరంగం పనుల్లో రూ.36.92 కోట్ల పనులు పెండింగ్ ఉండగా గత ప్రభుత్వం అందులోంచి రూ.34.27 కోట్ల పనులు రద్దు చేసి 2.5కిలోమీటర్ల సొరంగం పనులు, కాలువ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి 59ఏ ప్యాకేజి కింద రూ.160.518 కోట్లకు అంచనాలు పెంచి నిర్వహించిన టెండర్‌ను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. అయితే 2.5కిలోమీటర్ల సొరంగానికి లైనింగ్ పనులు చేయలేదు. విజిలెన్స్ బృందం ఈ పనులతోపాటు కాలువలో కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేయించడంపైనా పరిశీలించారు. ప్రాజెక్టు అధికారుల నుంచి తీసుకున్న రికార్డుల ఆధారంగా ఈ విచారణ సాగుతుండగా, అసలు పనులు చేశారా, అవసరం లేని చోట కంట్రోల్ బ్లాసింగ్ పెట్టి నిధులు దోచుకున్నారా, అసలు పనులే చేయాలేదా అన్న కోణంలో విచారణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment