సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగిరపరచి త్వరతగతిన కార్యకలాపాలు ప్రారంభిచవలసిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి. విజయ సాయిరెడ్డి సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన హామీలలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా అందుకు అనుగుణంగానే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి గత ఏడాది ఫిబ్రవరి 27న అధికారికంగా ప్రకటించారు.
విశాఖపట్నంలో టీడీపీకి మరో షాక్
కానీ.. ఈ ప్రకటన వెలువడి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ఆరంభం కాలేదని తెలిపారు. కొత్త రైల్వే జోన్ వలన అనేక పోర్టులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌కు రైలు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతోపాటు, సరుకుల రవాణా ద్వారా ఆర్థికంగా రాష్ట్రానికి ఊతమిచ్చినట్లుతుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. ఏటా 13 వేల కోట్ల రూపాయల ఆదాయంతో ఇది దేశంలోనే అత్యంత లాభదాయక రైల్వే జోన్ అవుతుందని చెప్పారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టులకు సేవలందించడం ద్వారా ఈ రైల్వే జోన్ అత్యధిక ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని తెలిపారు. రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తే రాష్ట్రంలోని పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత త్వరలో కార్యకలాపాలు ప్రారంభించవలసిందిగా ఆయన కేంద్ర రైల్యే మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment