
అవకాశవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు ఇతనొక్కడే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకంతో రైతులను ఆదుకోవచ్చని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా పథకం అమలు కోసం రూ.5510 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ పథకంలో భాగంగా 50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ. 12,500 చొప్పన సాయం అందుతుందని తెలిపారు. ఈ పథకంతో నోరు పెగలడం లేదు కదా చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం వరుస ట్వీట్లతో చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు.
‘పోలీసులకు వీక్లీ ఆఫ్, హోంగార్డుల వేతనం పెంపు లాంటి వాటిని వైఎస్ జగన్ ప్రభుత్వంలో అధికారులే ప్రకటించారు. అదే చంద్రబాబు హయాంలో న్యూస్ చానళ్లు ప్రైమ్ టైంలో భారీ మీడియా సమావేశం జరిగేది. సంఘాల నాయకులను ముందే పిలిపించి సీఎం వీరుడు, శూరుడు అని పొగిడించే కార్యక్రమాలు ఉండేవి’, ‘బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నప్పటికీ అప్పటి చంద్రబాబు సర్కారు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి డిస్కమ్‌లను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది’.
‘యూ-టర్న్ అనే పదం 1930 ప్రాంతంలో వాడుకలోకి వచ్చిందని ప్రఖ్యాత మెర్రియం వెబ్‌స్టర్ ఇంగ్లిష్ డిక్షనరీ చెబుతోంది. ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు దాన్ని ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబు గారిదే. అవకాశవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు ఇతనొక్కడే’అంటూ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.