విజ్ఞానకేంద్రం విశ్వోదయ
ప్రజాగాయకుడు గద్దర్
కావలి: విద్యార్థుల ఉజ్వల భవి తను తీరిదిద్దే విజ్ఙాన కేంద్రం విశ్వోదయ విద్యాసంస్థ అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. స్థానిక విశ్వోదయ విద్యాసంస్థల వ్యవస్థాపక దినం సందర్భంగా శుక్రవారం రాత్రి గద్దర్‌కు ఆ సంస్థ నిర్వాహకులు విశ్వోదయ గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. గద్దర్ మాట్లాడుతూ విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు దివంగత దొడ్ల రామచంద్రారెడ్డి ఎంతో మందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తన్నారు.
ఎస్‌ఆర్ శంకరన్ లాంటి వ్యక్తులే ఈ విద్యాసంస్థలకు వచ్చారంటే అతని గొప్పతనం అర్ధమవుతుందన్నారు. ఇక్కడ చదివిన సుబ్రహ్మణ్యం ఐఏఎస్ పూర్తి చేసి ముఖ్యమంత్రి కార్యదర్శి అయ్యాడంటే ఈ విద్యాసంస్థల్లో పాఠాలు ఎలా బోధిస్తారో అర్థమవుతోందన్నారు. చిన్నారులతో కలిసి గద్దర్ పాటలు పాడారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ రామ్‌సెంటర్ నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ రామ్‌సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్‌రెడ్డి, డెరైక్టర్ తాతిరెడ్డి, విశ్వోదయ విద్యాసంస్థలకు చెందిన కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.