జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 67 పంచాయతీల్లో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నేటీకీ పైసా విదల్చలేదు.
67 గ్రామాల్లో పుష్కర పనులకు
రూ.8.08 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు
నేటికీ నిధులు విదల్చని సర్కారు
38 వేల మంది పారిశుధ్య కార్మికుల అవసరమని అంచనా
పర్యవేక్షణకు టాస్క్‌పోర్స్ కమిటీ
కొవ్వూరు:జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 67 పంచాయతీల్లో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నేటీకీ పైసా విదల్చలేదు. వివిధ పనులు చేపట్టేందుకు రూ.8.08 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసిన పంచాయతీరాజ్ అధికారులు ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు విడుదల కాలేదు. స్నానఘట్టాల వద్ద, ఏటిగట్టుపై లైట్ల ఏర్పాటు, చెత్త సేకరణ కు రిక్షాలు, ఆటోలు సమకూర్చుకోవడం, బ్లీచింగ్, ఫినాయిల్ వంటివి కొనుగోలు, సూచిక బోర్డులు, డంపింగ్ యార్డుల ఏర్పాటు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులను పంచాయతీలు చేపట్టాల్సి ఉంది. వీటికి సకాలంలో నిధులు అందకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 98 స్నానఘట్టాలు ఉండగా, వీటిని ఏ-గ్రేడ్‌లో 19, బీ-గ్రేడ్‌లో 27, సీ-గ్రేడ్‌లో 52 చొప్పున ఉన్నాయి. వీటిలో 24గంటలూ పారిశుధ్య పనులు నిర్వహించేందుకు పంచాయతీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు.
పారిశుధ్య పనులకు ముందస్తు ప్రణాళిక
జిల్లాలో 14 వేల బ్లీచింగ్ బస్తాలు, 24వేల లీటర్ల ఫినాయిల్, 19వేల బస్తాల సున్నం, 3,600 డస్ట్‌బిన్స్ అవసరమవుతాయని అంచనా వేశారు. జిల్లాలోని వివిధ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందిలో సగం మందిని పుష్కరాలు జరిగే 67 గ్రామాలకు తరలించాలని నిర్ణయించారు. డంపింగ్ యార్డుల ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రభుత్వ ఖాళీ స్థలాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. చెత్తను తరలించేందుకు రిక్షాలు, హైడ్రాలిక్ ఆటోలను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ సమకూర్చాల్సి ఉంది. అవసరాన్ని బట్టి సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తారు. ప్రతి ఘాట్‌కు ఈవోపీఆర్‌డీ స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించాలని నిర్ణయించారు. ఘాట్ స్థాయిని బట్టి 10 నుంచి 15 మంది కార్యదర్శులను నియమించాలని ప్రతిపాదించారు. భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు, సూచనలు చేసేందుకు ప్రతి స్నాన ఘట్టంలో మైక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
కరెంటు లేని సమయంలో స్నానఘట్టాల వద్ద జనరేటర్ సదుపాయం కల్పించేందుకు, ఏటిగట్టు వెంబడి సూచిక బోర్డులు, ట్యూబ్‌లైట్లు, సోడియం వేపర్‌ల్యాంప్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. స్నాన ఘట్టాల వద్ద పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా రెండేసి చొప్పున మరుగుదొడ్లు, యూజ్ అండ్ పే పద్ధతిలో సులభ్ కాంప్లెక్స్‌లు వంటివి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నదీతీరంలో ఉన్న పంచాయతీలతోపాటు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న గ్రామాలు, మండల కేంద్రాల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రతి స్నాన ఘట్టంలో వృద్ధులు, వికలాంగులు స్నానాలు ఆచరించేందుకు అనువుగా తుంపర స్నాన సౌకర్యం (షవర్లు) కల్పించాలని నిర్ణయించారు. నిధులు విడుదల కాకపోవడంతో వీటిలో ఒక్క పనీ చేపట్టలేని దుస్థితి నెలకొంది.
పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ కమిటీ
పుష్కర పనుల పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో డీపీవో అధ్యక్షతన పనిచేసే విధంగా టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించారు. ప్రతి శుక్రవారం ఈ కమిటీ సమావేశమై ఏర్పాట్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, నదీ తీరంలో పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్ల ఏర్పాట్లు, ఇతర పనులపై చర్చిస్తుంది. ఈ కమిటీకి డీపీవో చైర్మన్‌గా, ముగ్గురు ఈవోపీఆర్‌డీలు, నలుగురు కార్యద ర్శులు, ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో కలిపి 13 మంది సభ్యులు ఉంటారు. ఇప్పటికే ఈ కమిటీ జిల్లాలో నాలుగు విడతలుగా సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించింది.
38 వేల మంది పారిశుధ్య సిబ్బంది అవసరం
జిల్లావ్యాప్తంగా 67 పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు 38 వేల మంది పారిశుధ్య సిబ్బంది అవసరమని అధికారులు అంచనా వేశారు. ఏ-గ్రేడ్ స్నానఘట్టంలో 60 మంది, బీ-గ్రేడ్‌లో 50 మంది, సీ-గ్రేడ్‌లో 30 మంది చొప్పున సిబ్బందిని నియమించాల్సి ఉంది. మూడు షిఫ్టుల్లో వీరంతా పనిచేయాల్సి ఉంటుంది. వీరికి 12 రోజులపాటు వసతి, భోజన సదుపాయం ఆయా పంచాయతీల్లో కల్పిస్తారు. గ్రామాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కల్యాణ మండపాల్లో వసతి సదుపాయాలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. స్వీపర్లకు రెండు జతల యూనిఫాం, గ్లౌజులు వంటి సమకూర్చాల్సి ఉంటుంది.