
షేర్‌మహ్మద్‌పేట గ్రామం
పశ్చిమ కృష్ణాను కిడ్నీ భూతం కబళిస్తోంది. ఇప్పటికే తిరువూరు, మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో కిడ్నీ రోగాలతో ప్రజలు మృత్యువాత చెందుతున్నారు. తాజాగా జగ్గయ్యపేట మండలంలోనూ పెద్ద సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారనే విషయం బహిర్గతమైంది. ఒక్క షేర్‌మహ్మద్‌పేట గ్రామంలోనే 22 మంది కిడ్నీ బాధితులున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్లే ప్రజలు కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని ఏ.కొండూరు, జి.కొండూరు, తిరువూరు, గంపలగూడెం, మైలవరం, నూజివీడు తదితర మండలాలకే పరిమితం అనుకుంటున్న కిడ్నీ వ్యాధులు క్రమక్రమంగా పశ్చిమ కృష్ణా మొత్తాన్ని కబళిస్తోంది. తాజాగా జగ్గయ్యపేట మండలంలోను కిడ్నీ రోగులు బయటపడుతున్నారు. ఒక్క షేర్‌మహ్మద్‌పేట గ్రామంలోనే దాదాపు 22 మంది బాధితులున్నారనే విషయం
బయటకొచ్చింది. గిరిజన తండాల్లో ప్రజల ఆహారం, ఆచారాలు, మద్యం వంటి కారణాలతో కిడ్నీ రోగాల బారిన పడుతున్నారని పాలకులు చెబుతున్నారు. మరి మెట్టప్రాంతమైన షేర్‌మహ్మద్‌పేట గ్రామంలో కూడా ఈ సమస్య ఉండటంపై ఏం సమాధానం చెబుతారనివామపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. యుద్ధప్రాతిపాదికతన అందరికి వైద్య పరీక్షలు నిర్వహించి రోగులను గుర్తించాలని స్థానికులు వేడుకుంటున్నారు. జగ్గయ్యపేట మండలానికి చెందిన మేజర్ పంచాయితీ షేర్‌మహమ్మద్‌పేట. దాదాపు ఆరు వేల మంది ప్రజలు ఉన్న ఈ గ్రామం నేడు కిడ్నీ బాధితులతో విలవిల్లాడుతోంది. 20 రోజుల కిందట ఈ గ్రామంలో కిడ్నీ పాడైపోవడంతో మక్కల శాంతమ్మ (47) అనే మహిళ చనిపోయింది. ఆర్నెళ్ల కిందట డయాలసిస్ రోగి పల్లెబోయిన చంటి కూడా మృత్యువాత పడ్డాడు. చాలా మందికి తాము కిడ్నీ వ్యాధిగ్రస్తులమన్న విషయం తెలియడం లేదు. మరికొంత మంది తెలిసి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. గ్రామంలో చాలా మంది మోకాలి నొప్పులతో బాధపడుతున్నారు. ఏ పని చేసుకోలేక పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ కిడ్నీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.
ఫ్లోరైడ్ నీటితోనే అసలు సమస్య...
షేర్‌మహ్మద్‌పేటలో తాగే నీటిలో అధిక ఫ్లోరైడ్ ఉందని ప్రజలు వాపోతున్నారు. స్థానిక సీపీఎం నాయకులు పంచాయతీ నుంచి సరఫరా చేసే నీటిని పరీక్ష చేయించగా ఫ్లోరైడ్ పరిమాణం దాదాపు 600 పీపీఎం ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ఫ్లోరైడ్ లేదంటూ నివేదికలు ఇస్తున్నారు. గ్రామంలోని కొన్ని బోరు పంపులలో ఫ్లోరైడ్ ఉన్న మాట వాస్తవమేనని చెబుతున్నారు. గ్రామంలో ఆర్‌ఓ ప్లాంట్‌లు ఉన్నప్పటికి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు అక్కడి నుంచి నీటిని తెచ్చుకోలేక అందుబాటులో ఉన్న నీటినే వాడుతుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. టీడీపీ నాయకులు తమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా కృష్ణా నది నీటిని తెస్తామని హామీ ఇస్తున్నారు తప్ప ఆచరణలో పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కృష్ణా జలాలు అన్ని గ్రామాలకు అందేలా చూడాలని కోరుతున్నారు. మరోవైపు ఆటోనగర్‌లోని ఫ్యాక్టరీలు విడుదల చేసే రసాయన పదార్థాలు భూమిలో కలపడంతో అవి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని వాపోతున్నారు.
హామీలు సరే...ఆచరణేదీ ?
ఏదో ఒకటి రెండు గ్రామాలకే పరిమితం అనుకుంటున్న కిడ్నీ వ్యాధులు నేడు పశ్చిమ కృష్ణ మొత్తాన్ని కబళిస్తోంది. ప్రభుత్వం మాత్రం తగిన విధంగా స్పందించడం లేదు. మంత్రి దేవినేని ఉమా, జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలలో కొన్ని నేటికీ కార్యరూపందాల్చలేదు. నూజివీడులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని రెండు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం బుధవారం మంత్రి దేవినేని హడావుడిగా ప్రారంభించినా పూర్తిగా సేవలు అందించడానికి మరో వారం పది రోజుల సమయం పట్టనుంది. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా, భూమి పంపీణి, వైద్య శిబిరాల ఏర్పాటు ఎప్పటికి నేరవేరుతాయో ప్రభుత్వ యంత్రాగానికే తెలియాలి. ప్రభుత్వం వెంటనే పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి తగిన టెస్ట్‌లను చేసి, తగిన మందులను అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment