‘సచివాలయ’ పరీక్షలకు 92.77 శాతం హాజరు  | Village Secretary First Day Written Examination was finished | Sakshi
Sakshi News home page

‘సచివాలయ’ పరీక్షలకు 92.77 శాతం హాజరు 

Published Mon, Sep 2 2019 3:38 AM | Last Updated on Mon, Sep 2 2019 4:42 AM

Village Secretary First Day Written Examination was finished - Sakshi

ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో పరీక్ష రాసి వస్తున్న అభ్యర్థులు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌:  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు తొలిరోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా మొదలయ్యాయి. 92.77 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 12,53,974 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,62,164 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 2,95,980 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,72,420 మంది హాజరయ్యారు. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు 92.77 శాతం హాజరు నమోదు కావడం అంటే నియామక ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతమైనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్‌ షీట్లు తారుమారయ్యాయి. వేంపెంట అభ్యర్థులకు పత్తికొండ అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు, పత్తికొండ అభ్యర్థులకు వేంపెంట అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు వచ్చాయి. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అదనపు ఓఎంఆర్‌ షీట్లను సమకూర్చారు. రెండు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించారు. ఈ ఒక్క సంఘటన మినహా తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.  

అధికారుల ప్రత్యేక చర్యలు  
మండల కేంద్రాల్లో సైతం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం హాజరు శాతం అత్యధికంగా నమోదు కావడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం పరీక్షలకు హజరు కావాల్సిన అభ్యర్థుల్లో 16 వేల మంది శనివారం సాయంత్రం వరకు హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. అధికారులు వారికి ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపారు, వాయిస్‌ కాల్స్‌ చేశారు. ఇలాంటి ప్రత్యేక చర్యలతో హాజరు శాతం పెరిగిందని అంటున్నారు.  

ప్రాథమిక ‘కీ’ విడుదల  
తొలిరోజు జరిగిన రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పరీక్షల నిర్వహణ కమిటీ చైర్మన్, కన్వీనర్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీనిపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రతి పరీక్ష జరిగిన తేదీకి ఐదు రోజుల అనంతరం తుది ‘కీ’ని విడుదల చేస్తారు.   

23–25 తేదీల మధ్య మెరిట్‌ జాబితాలు  
రాత పరీక్షల జవాబు పత్రాలైన ఓఎమ్మార్‌ షీట్లను అన్ని జిల్లాల నుంచి నాగార్జున యూనివర్సిటీకి తరలించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఓఎమ్మార్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియ మొదలవుతుందని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. రోజుకు 4 లక్షల షీట్ల స్కానింగ్‌ పూర్తవుతుందన్నారు. అన్ని పరీక్షల ఓఎమ్మార్‌ షీట్లను రెండు విడతల పాటు స్కానింగ్‌ చేసే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ వెల్లడించారు. ఈ నెల 23–25 తేదీల మధ్య ఉద్యోగాల వారీగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిట్‌ జాబితాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు.   

గుండెపోటుతో అభ్యర్థి మృతి  
గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఓ అభ్యర్థి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన గుడాల నరేష్‌ (30) పూలపల్లి శ్రీగౌతమి స్కూల్‌లో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన అనంతరం నరేష్‌కు గుండెలో నొప్పి రావడంతో విధుల్లో ఉన్న ఏఎన్‌ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరం వర్మ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుడాల నరేష్‌ మరణించాడు.  

పరీక్ష కోసం వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది   
సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని పరీక్ష రాయకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళేనికి చెందిన ఎర్రబోతు సుప్రియ గూడూరులో గ్రామ సచివాలయ పరీక్ష రాసేందుకు వచ్చింది. నిండుగర్భిణి కావడంతో పరీక్ష సమయానికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే గూడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినందుకు సంతోషపడాలో, పరీక్ష రాయలేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదని సుప్రియ పేర్కొంది.   

పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరు  
గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరయ్యారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన చోళ్ల మోహనరావు, ఆయన కుమార్తె ఇందిర, కుమారుడు నరేష్‌కుమార్‌ గ్రామ సచివాలయం ఉద్యోగానికి పరీక్ష రాశారు. మోహన్‌రావు శ్రీనివాస కళాశాల, ఇందిర నారాయణ కళాశాల, నరేష్‌కుమార్‌ ఆర్‌కే జూనియర్‌ కాలేజీలో పరీక్షకు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సచివాలయ పరీక్షకు ఓ రిమాండ్‌ ఖైదీ హాజరయ్యాడు.  

తొలిరోజు విజయవంతం
పటిష్టమైన ప్రణాళిక, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారం, సమన్వయం వల్లే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు విజయవంతంగా మొదలయ్యాయని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరీక్షల తీరును, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ ప్రభుత్వ శాఖ పరీక్షలు నిర్వహించలేదన్నారు. పరీక్ష కేంద్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఏర్పాటు చేయడం వల్ల హాజరు శాతం పెరిగిందన్నారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేసిందని, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పోలీస్‌ శాఖ సహకరించిందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లకు సహకారం అందించేందుకు ఒక్కొక్క ప్రత్యేక అధికారిని జిల్లాలకు ముందుగానే పంపినట్టు వివరించారు.

వారు పరీక్షల ఏర్పాట్లలో కలెక్టర్లకు పూర్తిగా సహకరించారని, తాము రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్‌ ఆధారంగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో నిర్వహించే పరీక్షలకు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనే పరీక్షా కేంద్రాలు ఉండటం వల్ల అభ్యర్థులు సులువుగా చేరుకోవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశాలు లేవని చెప్పారు. మొత్తం 9,886 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తే 6,265 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మిగిలిన పోస్టుల్ని భర్తీ చేసే బాధ్యతను ప్రభుత్వం ఆ శాఖకు అప్పగించే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, విజయవాడలోని పలు కేంద్రాలను పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ గుంటూరు, నెల్లూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

అభ్యర్థుల కోసం 1,945 ఆర్టీసీ బస్సులు
సచివాలయ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ పెద్ద ఎత్తున రవాణా సౌకర్యం ఏర్పాటుచేసినట్లు సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు ఆదివారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం వారి సమీప జిల్లా కేంద్రాలకు రాష్ట్రవ్యాప్తంగా 1945 బస్సులను నడిపింది. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన బస్‌స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసింది. పరీక్ష సామగ్రిని జిల్లా కేంద్రాలకు తరలించేందుకు, పరీక్ష కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం సుమారు 16 గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న రాత పరీక్షలకు అభ్యర్థుల రద్దీని బట్టి ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అధికారవర్గాలు తెలిపాయి.

470 స్పెషల్‌ సర్వీసులు
వినాయకచవితి వరుస సెలవుల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సోమవారం సాయంత్రం 470 స్పెషల్‌ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆపరేషన్స్‌ విభాగం పేర్కొంది. అవసరానికి అనుగుణంగా రద్దీ ఉన్న మార్గాల్లో నడిపేందుకు విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో మరో 109 బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ నెల 4వ తేదీన కూడా అవసరమైన మేరకు స్పెషల్‌ బస్సులు నడపనున్నట్టు పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement