సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశా రు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు
విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఉండే, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకు చదువుకొనేలా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఆ పాఠశాలలు ఉండాలని.. ఉత్తర, దక్షిణ తెలంగాణలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
వెంటనే హోంగార్డుల నియామకాలు
పోలీసు శాఖలో ఏడెనిమిదేళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నారు.
మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగమివ్వండి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి పోలీసుశాఖలో అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఉన్నతాధికారులను సీఎం ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే చేర్చుకోవాలని సీఎస్, డీజీపీలకు సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి సంబంధించి అవరోధాలేమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.
గతంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ సమీక్ష సమావేశాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన ముస్లిం పెద్దలు
శుక్రవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలసి సన్మానించారు. మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలను అందచేశారు.
ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులొద్దు
తన కాన్వాయ్ ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ జామ్‌లతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రోడ్డు పై మూడు, నాలుగు లేన్లు ఉంటే.. ఒక లేన్‌లో సీఎం కాన్వాయ్ వెళ్లేలా చూడాలని సూచించారు. కాన్వాయ్‌లో ప్రస్తుతమున్న 15 వాహనాల సంఖ్యను 9కి తగ్గించాలన్నారు.
తమది ప్రజా ప్రభుత్వమని, తరచూ సమస్య లున్న చోటుకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎం సమీక్ష తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment