సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రతిష్టకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల పంపిణీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన దాకా ఆధునిక విధానాలను అనుసరిస్తూ దేశంలోనే ఉత్తమ పబ్లిక్ సర్విస్ కమిషన్‌గా టీఎస్‌పీఎస్సీ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు పేపర్ లీకవడం, కమిషన్ ఉద్యోగులే దీనికి పాల్పడటంతో ఒక్కసారిగా అలజడికి గురైంది.
మూడో వంతు టీఎస్‌పీఎస్సీ ద్వారానే..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో మూడో వంతుకుపైగా టీఎస్‌పీఎస్సీ ద్వారానే చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన క మిషన్.. వాటిలో కొన్నింటికి దరఖాస్తులు స్వీకరిస్తోంది కూడా.
ఇందులో కీలకమై న గ్రూప్–1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు పూర్తవగా.. మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. వివిధ కేటగిరీల్లో ఇంజనీరింగ్ ఉద్యోగ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని కేటగిరీలకు త్వరలో అర్హత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ఇలాంటి తరుణంలో కమిషన్‌కు చెందిన సీక్రెట్ కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు వెళ్లడంతో టీఎస్‌పీఎస్సీ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయంటూ.. ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, ఈనెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల అర్హత పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. కానీ టౌన్ ప్లానింగ్ పేపర్‌ను ఓ ఉద్యోగి స్వయంగా లీక్ చేసినట్టు వెల్లడికావడం కలకలం రేపింది.
ఇంకా ఏమైనా లీకయ్యాయా?
టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు/ఉద్యోగ పరీక్షల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పేపర్ లీకేజీ ఘటనతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రస్తుతం వాయిదా వేసిన రెండు పరీక్షల సమాచారం మాత్రమే బయటకు పొక్కిందా? లేక ఇంతకుముందే జరిగిన పరీక్షలు, త్వరలో జరగాల్సిన పరీక్షల సమాచారం ఏమైనా బయటికి వెళ్లిందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రాసిన, రాయాల్సిన ఉద్యోగ పరీక్షలతోపాటు నియామక ప్రక్రియలు నిలిచిపోతాయేమోననే ఆవేదనలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించి లీకేజీపై స్పష్టత రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మిగతా పరీక్షల పేపర్లు ఏమైనా లీకయ్యాయా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
ఉద్యోగుల బాధ్యతలపై ‘సమీక్ష’!
ఈ పరిణామాలతో అసలు కమిషన్‌లో అంతర్గతంగా ఏం జరుగుతోందన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ‘లీకేజీ’వీరులు ఇంకెందరు ఉన్నారనే కోణంలో పరిశీలన జరుపుతున్నారు. ప్రతి ఉద్యోగి నుంచి వివరాలు సేకరించడంతోపాటు ఉద్యోగులు నిర్వహిస్తున్న విధులను సమీక్షిస్తున్నారు. ప్రస్తుత కేసు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఉద్యోగుల విధులు/బాధ్యతల్లో ప్రక్షాళన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment