సేవలకు సిద్ధం | Village Volunteers Take Charge From Tomorrow | Sakshi
Sakshi News home page

సేవలకు సిద్ధం

Published Wed, Aug 14 2019 10:06 AM | Last Updated on Wed, Aug 14 2019 10:48 AM

Village Volunteers Take Charge From Tomorrow - Sakshi

సంక్షేమం ఇక పారదర్శకం కానుంది. ప్రతి ఇంటికీ పథకాలు చేరువ కానున్నాయి. ఇందుకోసం దేశంలోనే వినూత్న రీతిలో వలంటీర్ల వ్యవస్థను రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన 10,853మందికి శిక్షణ నిచ్చి రంగంలోకి దింపుతున్నారు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీరు విధుల్లో చేరనున్నారు. అప్పటినుంచి తమకు కేటాయించిన 50 కుటుంబాలకు పథకాలు చేరువ చేయడం... పింఛన్, రేషన్‌ వంటివి ఇంటికే చేరవేయడం... వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొత్తగా లబ్ధిదారుల ఎంపికలోనూ వీరు కీలకంగా వ్యవహరించనున్నారు.

లక్కవపుకోట(శృంగవరపుకోట): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పారదర్శకంగా సక్రమంగా లబ్ధిదారులకు చేరువ చేసేందుకు... నిరుద్యోగ నిర్మూలనకు... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రూపొందించారు. దీనికోసం జిల్లాలోని 34 మండలాల్లో 10,853 మంది గ్రామ వలంటీర్లను ఎంపిక చేసి వారికి పూర్తి శిక్షణనిచ్చారు. నవరత్నాలు, పంచాయతీ వ్యవస్థ పనితీరు, ప్రజలతో ఎలా మెలగాలి తదితర అంశాలపై మూడు రోజుల పాటు శిక్షణనిచ్చారు. ప్రభుత్వ పాలన, వ్యవస్థల పనితీరు తెలుసుకోవడానికి 128 పేజీలతో కూడిన కరదీపికను ముద్రించి ప్రతీ వలంటీర్‌కు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వలంటీర్లు ఈ నెల 15వ తేదీ నుంచి అధికారికంగా విధుల్లో చేరనున్నారు.

 వలంటీర్ల విధులు, బాధ్యతలు..
-కేటాయించిన 50 కుంటుంబాల పూర్తి సమాచారం సేకరించడం.
-బేస్‌లైన్‌ సర్వే ఆధారంగా వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం.
-కేటాయించిన 50 కుటుంబాలు పొందుతున్న పథకాలు, ప్రయోజనాలపై సమాచారం నమోదు చేయడం
-సచివాలయాల్లో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావడం.
-తమకు కేటాయించిన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడడం.
-మద్యపానం, బాల్యవివాహాల నివారణలో సహాయసహకారాలు అందించడం.
-కేంద్ర, రాష్ట్ర పభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం.
-కుల, మత, వర్గ, లింగ, రాజకీయాలకు అతీతంగా అర్హత కల్గిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను చేరవేయడం.
-గ్రామాల్లో కొత్తగా ప్రవేశించిన వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచాయితీ దృష్టికి తీసుకెళ్లడం

వలంటీర్ల సేవలపై నిఘా..
వలంటీర్లకు నెలకు రూ. 5వేలు గౌరవ వేతనం గ్రామపంచాయతీల ద్వారా అందజేస్తారు. నిధులు పంచాయతీలకు ప్రభుత్వమే సమకూరుస్తుంది.  గ్రామవలంటీర్ల పనితీరును ఏంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తారు. నివేదికలను ప్రతీ నెల కిందిస్థాయి అధికారులు ఎంపీడీఓకు అందిస్తారు. ఆ నివేదికలపై కలెక్టర్‌ సమీక్షిస్తారు. వలంటీర్‌ పనితీరు సక్రమంగా లేకపోతే తగిన మార్గనిర్దేశం చేసి మెరుగు పడేలా చేస్తారు. బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే తొలగిస్తారు.

అందించాల్సిన సేవలు:

-నెలవారీ పింఛన్లు, రేషన్‌ సరకులు నేరుగా ఇంటికే తీసుకెళ్లి అందజేయడం, ఇమాన్, మ్యూజిన్లు, చర్ఛి పాస్టర్లకు నెలవారీ వేతనాలు అందించడం.
-ఏడాదికోసారి విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్, అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ చేయూత, చేతివృత్తుల వారికి ఆర్థి క సాయం, వేట నిషేధ సమయంలో మత్య్స కారులకు పరిహారం, చిరు, వీధి వ్యాపారులకు వడ్టీలేని ఆర్థిక సహాయం అందించడం.
-అవసరమైనప్పుడు ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు, అన్నిరకాల ధ్రువపత్రాలు, వివిధ కార్పొరేషన్ల నుంచి ఆర్థిక సహాయం. వైఎస్సార్‌ బీమా, గొర్రెలు, పశువులకు బీమా, వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక మంజూరు ఉత్తర్వులివ్వడం, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఇళ్ల స్థలాల పంపిణీ, విద్యుత్‌ కనక్షన్లు, భవన నిర్మాణ అనుమతులు, తాగునీటి కుళాయిల కనెక్షన్లు ఇప్పించడం వంటి సేవలందించాలి.
-ప్రభుత్వం అందించే పథకాలు, అర్హతలు, ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు తన పరిధి లోని 50 కుంటుంబాలకు అవగాహన కల్పిం చడం, పారిశుద్ధ్య పనులు చేయించడం, ప ర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేయడం.

బాధ్యతతో పనిచేయాలి..
వలంటీర్‌గా ఎంపికైనవారు ఇదేదో ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా భావించి పనిచేయాలి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రతీ 50 కుంటుంబాలకు చేరవేయాలి. ఒత్తిడికి తలొగ్గకూడదు, పారదర్శకంగా, నీతివంతంగా పనిచేయాలి. ఈ ఆవకాశాన్ని వలంటీర్లు దుర్విని యోగం చేస్తే తొలగించక తప్పదు.
– కడుబండి శ్రీనివాసరావు, శృంగవరపుకోట ఎమ్మెల్యే 

గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రయోజన కరమే..
గ్రామ వలంటీర్‌ వ్యవస్థ ప్రజలకు ప్రయోజన కరంగా వుంటుంది. ఇంత వరకు ప్రభుత్వ పరంగా ఏ పనిచేయాలన్నా పంచాయతీ కార్యదర్శులపైనే పెడుతున్నాం. వారికి పనిఒత్తడి వల్ల అశించిన మేరకు ఫలితాలు సాధించలేక పోతున్నాం. 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రజలకు, గ్రామ సచివాలయానికి మధ్య వారధిలా పనిచేసే ఏర్పాటు చేయడం మంచి ప్రయత్నమే.
– బి.కల్యాణి, ఎంపీడీఓ, లక్కవరపుకోట  

ఉపాధి లభించింది..
చదువులు పూర్తిచేసుకుని తల్లిదండ్రులకు భారంగా ఉన్న మాలాంటి వారికి వలంటీర్‌ ఉద్యోగం ఊరటనిచ్చింది. నేను గ్రామ వలంటీర్‌ శిక్షణ పూర్తి చేసుకున్నాను. ప్రభుత్వం అప్పగించిన సేవలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను.
– పిల్లల గోపి, తామరాపల్లి, లక్కవరపుకోట మండలం

బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తా..
నేను ఇంటర్‌మీడియట్‌ పూర్తి చేశాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వలంటీర్‌ పోస్టుకు దరఖాస్తు చేయగా ఎంపికయ్యాను. ఇప్పటికే మాకు రెండు రోజులపాటు శిక్షణచ్చారు. నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తాను. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తాను.               

– ఎస్‌.కె.ఫిరోజ్, లక్కవరపుకోట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement