
మేక, కోడిని మింగిన కొండ చిలువ మేకను మింగి మరొక మేకను చుట్టిన దృశ్యం
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన బూరుగువాడలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. విస్తారంగా వర్షాలు కురుస్తూ ముసురు కమ్ముకోవడంతో గ్రామస్తులంతా ఇళ్లలో ఉన్న సమయంలో గ్రామానికి శివారులో ఉన్న మేకల దొడ్డిలో కొండచిలువ ప్రవేశించింది. గ్రామంలోని పూనెం సింగరాజుకు చెందిన ఒక మేక, కోడిని మింగటంతో పాటు మరొక మేకను చుట్టి వేసి చంపే ప్రయత్నం చేసింది. అయితే మేకల దొడ్డిలో నుంచి మేకల శబ్దం బిగ్గరగా రావడంతో సింగరాజు హుటాహుటీన వెళ్లి చూశాడు.
అప్పటికే మేకను మింగిన కొండచిలువ మరొక మేకను చుట్టి ఉండటం గమనించాడు. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారంతా అక్కడికి చేరి కొండ చిలువను హతమార్చారు. కొండచిలువ చుట్టిన మేక కూడా మృతి చెందింది. పాకలో ఉన్న రెండు మేకలు, కోడి కొండ చిలువ దాడిలో మృతి చెందాయని సింగరాజు తెలిపారు. ఇదిలా ఉండగా బూరుగువాడ సమీపంలోని కొండ ప్రాంతంలో ఇటీవల కొండ చిలువలు సంచరిస్తూ కనిపిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఒకటి మృతి చెందినప్పటికీ మరొక రెండు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నట్టు గ్రామస్తులు చెప్పారు.