ఖాకీ గుప్పెట్లో తుందుర్రు
ఆంక్షల వలయంలో ఆక్వాపార్క్ బాధిత గ్రామాలు
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల్లో ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసు ఆంక్షలు కొనసాగుతుండటంతో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. బుధవారం నాటి ఘటనలతో భీతిల్లిపోయిన మహిళలు, వృద్ధులు, పిల్లలు గురువారం కూడా ఆ భయాందోళన నుంచి బయటకు రాలేదు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు తదితర గ్రామాల్లోకి బయటి వ్యక్తులను పోలీసులు అనుమతించలేదు. అప్రకటిత కర్ఫ్యూ కొనసాగింది. దీంతో విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లడా నికి భయపడ్డారు.
బుధవారం ఆక్వా ఫుడ్‌పా ర్క్ బాధిత గ్రామాల్లో భీతావహ పరిస్థితిని సృష్టించిన పోలీసులు.. మహిళలు, బాలింత లు, వృద్ధులని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దొరికినవారిని దొరికినట్టు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రోజంతా తిండీ తిప్పలు లేక చంటి పిల్లలు, చిన్నారులు అలమటిం చారు. అరెస్టయిన వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై అర్ధరాత్రి వదిలిపెట్టారు. ఆ సమయాన ఇల్లు చేరుకున్న తల్లులు పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటికప్పుడు వంట చేసి పిల్లలకు నాలుగు మెతుకులు తినిపించారు.
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
ప్రభుత్వం తమపై పోలీసులను ప్రయోగించడం పట్ల గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు తమ పట్ల ఇంత రాక్షసంగా వ్యవహరించడం తగదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిç ³రిస్థితు ల్లోనూ ఆక్వా ఫుడ్ పార్క్ కట్టనీయబోమని, ప్రాణాలు పోయినా.. ఎన్నిసార్లు పోలీసులను ప్రయోగించినా తమ వైఖరి మారదని మహిళలంతా మూకుమ్మడిగా తేల్చి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తామేంటో నిరూపిస్తామని శపథం చేస్తున్నారు.