
మేం మీ స్నేహితులం
ఆ గ్రామాలు రాజకీయ కక్షలతో రగిలిపోతున్నాయి...దీనికి తోడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అభివృద్ధికి దూరంగా అవి మగ్గిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు ‘సాక్షి’ కృషిచేసింది. పార్వతీపురానికి 60 కిలోమీటర్ల దూరంలో మక్కువ మండలంలో ఉన్న కోన, దబ్బగెడ్డ గ్రామాల సమస్యలు తెలుసుకునేందుకు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ... ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వెనుకడుగువేయకుండా మారుమూల గ్రామాల్లో కలయతిరిగి, అందర్నీ అప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. మేము మీ స్నేహితులమని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. గ్రామస్తులతో ఏఎస్పీ సంభాషణ ఇలా సాగింది...
ఏఎస్పీ ఏమన్నారంటే...
ఒకప్పటి పోలీసులకు...ఇప్పటి పోలీసులకు మార్పు వచ్చింది. అప్పుడు మీరు పోలీసుల వద్దకు వచ్చేవారు...ఇప్పుడు పోలీసులే మీ వద్దకు వస్తున్నారు. ప్రతి గ్రామాన్ని ఓ పోలీసు దత్తత తీసుకుని మీతో మమేకమవుతున్నారు. ఒక్క శాంతిభద్రతల సమస్యే కాదు...ఏ సమస్య అయినా ఆయా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. అసాంఘిక శక్తుల మాటలు విని యువత చెడు మార్గం పట్టకుండా పోలీసు ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇస్తున్నాం. ముఖ్యంగా రైతులు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అది మంచిది కాదు. సమస్యలు అందరికీ ఉంటాయి. ఆత్మహత్యలకు పాల్పడే ముందు మీ భార్యాపిల్లల గురించి ఆలోచించండి.
ఏఎస్పీ : నా పేరు రాహుల్ దేవ్ శర్మ, నేను పార్వతీపురం ఏఎస్పీని, మీ సమస్యలు తెలుసుకునేందుకు సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మీ దగ్గరుకు వచ్చాను
కోన, దబ్బగెడ్డ గ్రామస్తులు: నమస్కారం బాబూ...మా సమస్యలు తెలుసుకునేందుకు మీ అంతటి అధికారి మా గ్రామాలకు రావడం నిజంగా మా అదృష్టం. మీరొచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: మీ పేరు చెప్పండి...? మీ సమస్యలు చెప్పండి...?
కోన గ్రామస్తుడు లక్ష్మునాయుడు : సార్...నా పేరు కొట్టా డ లక్ష్ము నాయుడు. నాతో పాటు మా గ్రామంలో 24 మందికి పింఛన్లు ఆగిపోయాయి. దీంతో నానా ఇబ్బందులు
పడుతున్నాం. నెల నెలా వచ్చే పింఛన్ సొమ్ముతోనే బతుకీడుస్తున్నాం. పింఛన్లు వచ్చేలా చూడండి బాబు.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: మీరు ఆధార్ కార్డులు తీసుకున్నారా?రేషన్‌కార్డులో వయస్సుసరిపోయిందా ? మీ గ్రామం లో జన్మభూమి జరిగిందా ? అక్కడ సమస్య చెప్పారా ?
లక్ష్ము నాయుడు: అయ్యా...! ఆధార్ కార్డుంది. రేషన్ కార్డులో వయస్సు సరిపోయింది. జన్మభూమిలో సమస్య చెప్పాం. అయినా ఇప్పటి వరకు మాకు పింఛన్లు రాలేదు.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : మా ఎస్సై రవీంద్రరాజు మీ గ్రామానికి ఎంపీడీఓను, కార్యదర్శిని తీసుకు వచ్చి పింఛన్ల సమస్య తీరుస్తారు. నేను కూడా పెద్ద ఆఫీసర్‌తో మాట్లాడతాను. మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: మీ పేరు చెప్పండి...? మీ సమస్యలేంటి...?
శ్రీరామ్ : సార్ నా పేరు మరిశర్ల శ్రీరామ్. మాకు షుగర్ ఫ్యాక్టరీ బిల్లులివ్వడం లేదు.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: ఈ సమస్య చాలా వరకు తీరిపోయింది. సంబంధిత అధికారులతో మాట్లాడి మీ బిల్లులు వచ్చేలా కృషి చేస్తాను.
తౌడు: సార్...నా పేరు తాడ్డి తౌడు. మా గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టారు. అయితే ఆ కేంద్రంలో మా ఊరికలాసీలను పెట్టకుండా బయటగ్రామస్తులను పెట్టా రు. దీంతో మాకు కూలి లేక ఇబ్బందులు పడుతున్నాం. ఏటా మా గ్రామంలో ధాన్యం పనులు మేమే 15 మందిమి చేసేవారిమి. మాకు కలాసీ పనులు వచ్చేలా చేయండి.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: సరే ఈ విషయం సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాను.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: అమ్మా...! మీ పేరు చెప్పండి...?మహిళా సంఘాలు బాగున్నాయా...? ఉపాధి పనులు చేస్తున్నారా...? మీ సమస్యలు చెప్పండి...?
అనూరాధ : బాబూ నా పేరు మరిశర్ల అనూరాధ. మహిళా సంఘాలు బాగున్నాయి. ఉపాధి పనులు అవుతున్నాయి. అయితే మా చెల్లెలు చనిపోయాక ఆమె కుమారుడు ధనుంజయరావు ఇంటర్ చదువుతూ కళాశాలకు వెళ్లలేదు. దీంతో కాలేజీలో పేరు తీసేశారు. వాడు చదువుకునేలా చేయండయ్యా...!
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: సరే మా ఎస్సై వెళ్లి ఆ పని చేసి పెడతారు.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : అమ్మా...! మీ పేరు చెప్పండి...? పిల్లలకు మధ్యాహ్న భోజనం మంచిగా పెడుతున్నారా...? మెనూ పాటిస్తున్నారా...?
మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు : సార్...నా పేరు గొట్టా పు లక్ష్మి. సెప్టెంబర్ నుంచి మధ్యాహ్న భోజనం బిల్లులు రాలేదు. దీంతో అప్పులు చేసి పిల్లలకు భోజనం పెట్టాల్సి వస్తోంది. ఇంట్లో ఉన్న ఒక్కరిద్దరికే కూరలు కష్టం, అటువంటిది 149 మంది పిల్లలకు రోజూ అప్పు చేసి వంటలు చేయాలంటే ఎంత కష్టమో చూడండి. బిల్లు వచ్చే లా చేయండి. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాను. ఈ రోజు చుక్క కూర, పప్పు వండుతున్నాను. ఆహారంపై మూతలు వేస్తున్నాను. వంట షెడ్ లేదు, గ్యాస్ లేదు.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: ఎస్సై రవీంద్రతో మాట్లాడుతూ ఈ సమస్య మండలంలో ఎన్ని పాఠశాలల్లో ఉంది...?
ఎస్సై రవీంద్రరాజు: ఈ సమస్య దాదాపు అన్ని పాఠశాలల్లో ఉంది. మూడు, నాలుగు నెలలకొకసారి బిల్లులొస్తాయి. వంట షెడ్లు, గ్యాస్ లేదు. కొన్నింటికి ఈ మధ్య ప్రతిపాదనలు పెట్టారంటున్నారు.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: సరేనమ్మా...! ఈ సమస్య సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తాను. వంటలు బాగా వండి పిల్లలకు పెట్టండి.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : పిల్లలూ బాగున్నారా...? మీ సమస్యలు చెప్పండి
కోన పాఠశాల పిల్లలు : సార్...మేము ఏడోతరగతి చదువుతున్నాం. తరగతి గదులు చాలడం లేదు. బెంచీలు లేక నేలపై కూర్చొంటున్నాం.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : హెడ్మాస్టర్ గారు...సమస్యల పరిస్థితి ఏంటి...?
హెచ్‌ఎం శివున్నాయుడు : పాఠశాలకు అదనపు గదులు మంజూరయ్యాయి సార్. ఆడపిల్లలకు మరుగుదొడ్లున్నాయి.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : పిల్లలూ చక్కగా చదువుకోవాలి. రిజర్వేషన్లు ప్రకారం మంచి ఉద్యోగాలు సంపాదించాలి. గ్రామాభివృద్ధికి మీరంతా పాటుపడాలి. ఇవిగో చాక్లెట్లు తీసుకోండి.
పిల్లలు ః ఎస్ సార్...
ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ: హాయ్...యూత్...! ఎలా ఉన్నా రు...? మీసమస్యలు చెప్పండి...?(కుర్రాళ్ల భుజం తడుతూ...)
యువకులు: సార్ బాగున్నాం. ఉద్యోగావకాశాలకోసం చూస్తున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నాం.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : వెరీ గుడ్...!అవసరమైతే గతంలోలా శిక్షణ కూడా ఇస్తాం. చదివిన చదువుకు సార్థకమయ్యేలా ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు, గ్రామానికి సాయపడండి. అసాంఘిక శక్తులు చెప్పే మాటలు నమ్మి చెడుతోవ పట్టొద్దు. మా తరఫున వాలీబాల్ కిట్లు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. గ్రామంలో నాటు సారా అమ్మకాలు లేకుండా చూడండి. స్వచ్ఛభారత్‌ను నిర్వహించి రోగాలను దూరం చేయండి.
యువకులు : అలాగే సార్
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : అమ్మా...! మీ పేరు చెప్పండి...? మీ సమస్యలేంటి..?
సింహాచలం : అయ్యా...! నా పేరు ఇప్పాకుల సింహాచలం. మా ఊరి మాజీ ఎంపీటిసీ నా పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ తీసుకున్నాడు. ఇప్పుడు బ్యాంకు వారు నాకు లక్ష రూపాయల అప్పుందని, కట్టమని నోటీసులిచ్చారు. అప్పు సంగతి నాకు తెలీదు. ఆ అప్పు ఎలా కట్టగలను. నాకు చావే గతి అంటూ... తల బాదుకొంటూ ఏఎస్పీ కాళ్లపై పడి ఏడ్చింది.
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: నీ సమస్యను మా ఎస్సై పరిష్కరిస్తారు. మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం. బినామీ రుణాలు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ వీఆర్వో ఎవరు...?
వీఆర్‌ఓ: సార్... నా పేరు కోట సురేష్...!
ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: మీరు మా ఎస్సై కలిసి వెళ్లి ఈ సమస్యను పరిష్కరించండి.
దుప్పట్లు, చీరలు, వాలీబాల్ కిట్లు పంపిణీ
ఏఎస్సీ రాహుల్ దేవ్ శర్మ గ్రామాలను సందర్శించిన సందర్భంగా పోలీసుల ఆయా గ్రామాల వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు, యువతకు వాలీబాల్ కిట్లు, దోమతెరలు, పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేశారు. మక్కువ మండలం మారుమూల కోన, దబ్బగెడ్డ తదితర ప్రాంతాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహన్‌రావు, మక్కువ ఎస్సై వి.రవీంద్రరాజు తదితరులు ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ భద్రత ఏర్పాటు చేశారు.