
ప్రయాణంలో ప్రయాసలు
దూరంగా రోడ్డు మలుపుకావల నుంచి.. ‘పోయ్..పోయ్’ అన్న రబ్బర్ హారన్ శబ్దం గాలిలో తేలివచ్చి చెవుల పడగానే ఆ ఊరి కూడలిలోనో; ఏ ఊరూ లేకపోయినా
దూరంగా రోడ్డు మలుపుకావల నుంచి.. ‘పోయ్..పోయ్’ అన్న రబ్బర్ హారన్ శబ్దం గాలిలో తేలివచ్చి చెవుల పడగానే ఆ ఊరి కూడలిలోనో; ఏ ఊరూ లేకపోయినా నాలుగు దుకాణాలుండే అడ్డరోడ్డు సెంటర్లోనో సందడి మొదలయ్యేది. తాము నిరీక్షిస్తున్న ఆత్మీయులెవరో వచ్చేస్తున్నట్టు జనం కళ్లు సంబరంగా వెలిగిపోయేవి. ఆ వెలుగుకు కారణం రానున్న ఎర్రబస్సు (అదే ఇప్పుడు ‘పల్లెవెలుగు’ అయింది). గత తరాల్లో ముఖ్యంగా గ్రామాల్లో వికాసానికీ, అవసరాలకూ ఆర్టీసీ బస్సు ఓ సంకేతం. తక్కిన ప్రపంచంతో అనుసంధానానికి ముఖ్య సాధనం. బస్సు రంగు మారి ఉండొచ్చు గానీ.. ఇప్పటికీ అనేక పల్లెలకు ఆర్టీసీ బస్సే పుష్పక విమానంతో సమానమైన ప్రయాణ సాధనం. ‘సురక్షిత ప్రయాణం-సుఖమయ జీవితం’, ప్రయాణీకులే మన దేవుళ్లు...చెయ్యి ఎత్తితే బస్సు ఆపుతాం...‘సమయ పాలన పాటిద్దాం-గమ్యం చేరుద్దాం’
వంటి నినాదాలతో జిల్లాలో నిత్యం మూడున్నర లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న 820 ఆర్టీసీ బస్సులు 3.40 లక్షల మందిని గమ్యాలకు చేరుస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలు ఎన్ని పెరిగినా.. నేటికీ ప్రజ ల ప్రయాణావసరాలు తీర్చడంలో కీలకంగా ఉన్న ఆర్టీసీకి సంబంధించి ప్రయాణికుల సమస్యలను ఎత్తి చూపాలని ‘సాక్షి’ భావించింది. జిల్లాలో ఆ వ్యవస్థకు సారథ్యం వహిస్తున్న రీజనల్ మేనేజర్ ఆర్‌వీఎస్ నాగేశ్వరరావును ఆ బాధ్యత స్వీకరించాల్సిందిగా కోరింది. అందుకు అంగీకరించిన ఆయన ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడాక సింగిల్‌స్టాప్ బస్సులో గోకవరం వెళ్లి, అక్కడి ప్రయాణికులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రెండు గంటలు సాగిన ఆయన వీఐపీ రిపోర్టింగ్ వివరాలిలా ఉన్నాయి...
ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆర్‌వీఎస్ నాగేశ్వరరావు (రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్‌లో) : ఏమ్మా నీ పేరేంటి? బస్సు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులుంటే మొహమాటం లేకుండా చెప్పండమ్మా!
ప్రయాణికురాలు : నా పేరు దేవి సర్! గతంలో ఇక్కడ ఎక్కువ సేపు బస్సుల కోసం చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఒక బస్సు వెళ్లి గంటైనా మరో బస్సు రాదు. అందుకే ప్రైవేట్ బస్సులు, ఆటోల్లో పోతున్నాం.
ఆర్‌ఎం : ఇప్పటికే గోకవరం వంటి ప్రాంతాలకు ప్యాసింజర్ సర్వీసులు అరగంట వ్యవధిలోనే తిప్పుతున్నాం. జనం ఎక్కువగా ఉంటే బస్సుల మధ్య సమయం ఇంకా తగ్గించి, సమస్య లేకుండా చేస్తానమ్మా. (మరొకరితో) : ఏమయ్యా నీ పేరేంటి? ఆర్టీసీ బస్సులతో ఏమైనా సమస్యలుంటే చెప్పు.
ప్రయాణికుడు : రమణ సార్, న్యూడెమోక్రసీలో పనిచేస్తుంటాను. ఇక్కడి నుంచి అడ్డతీగల వెళ్లాలంటే డెరైక్టు బస్సులేదండీ. ఎన్ని సార్లు మీ వాళ్ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు సర్. ఇక్కడి నుంచి సింగిల్ స్టాపులు ఎక్కువున్నాయి. ఆర్డినరీ బస్సులు కూడా ఎక్కువగా తిప్పితేనే ప్రయోజనం. పరిశీలించండి సర్.
ఆర్‌ఎం : గోకవరానికి ఆర్డినరీ బస్సులు మీరడుగుతున్నట్టు పెంచుతాం. అడ్డతీగల బస్సులు కూడా మూడు నెలల క్రితం పెంచాం. (మరొకరితో) : బాబూ నీ పేరేమిటి, బస్సులు సక్రమంగా తిరుగుతున్నాయా?
ప్రయాణికుడు : శివప్రసాద్ అండీ. రాజమండ్రి నుంచి రంపచోడవరం బస్సుల సంఖ్య పెంచాలండీ. మీరేమో బస్సులున్నాయంటారు. అవసరానికి ఉండటం లేదండీ!
ఆర్‌ఎం : బస్సుల్లో కొన్ని సమయాల్లో ప్రయాణికులు ఉండడం లేదు. రద్దీ ఉంటే తప్పక పెంచుతాం. (మరొకరితో) ఏమయ్యా మా బస్సులతో సమస్యలున్నాయా? మా స్టాఫ్ ఎలా ఉంటున్నారు?
ప్రయాణికుడు : గంగాధర్ అండీ. సింగిల్ స్టాప్ సర్వీసులు గోకవరం ప్రయాణికులకు అనుకూలంగా ఉన్నాయి. మీ కండక్టర్లు, డ్రైవర్లు ఇది వరకులా కాక బాగానే ఉంటున్నారు.
ఆర్‌ఎం: సింగిల్ స్టాప్ సర్వీసు 20 నిమిషాలకు ఒక టి నడుపుతున్నాం. ఇంకా రద్దీ ఉంటే 15 నిమిషాలకోటి తిప్పుతాం.
ఆర్‌ఎం (రాజమండ్రి-గోకవరం బస్‌లో ప్రయాణిస్తూ) : తల్లీ నీ పేరేంటి? బస్సులు సక్రమంగా ఉంటున్నాయా?
ప్రయాణికురాలు : నాగదేవండి. గోకవరం నుంచి యా ఎర్రంపాలెంకు బస్సులు సరిగా లేవు. ఉదయం 8.30 గంటలకు తర్వాత సాయంత్రం ఐదు గంటలకు కానీ బస్సు రావడం లేదు. మధ్యలో 3.30 గంటలకు ఒక బస్సు వేయాలి సర్.
ఆర్‌ఎం : పరిశీలించి, అవసరం అనుకుంటే బస్సుల సంఖ్య పెంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం సరేనా తల్లీ. (మరొకరితో) నీ పేరేమిటమ్మా? ఏమి చదువుతున్నావు, బస్సులు ఎలా నడుస్తున్నాయి?
విద్యార్థిని : సోనీ సర్, మాది బూరుగుపూడి. సాయంత్రం బస్సుల్లో వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. లోపల ఖాళీ ఉన్నా కుర్రాళ్లు డోరు దగ్గర వేలాడుతుంటారు. మేం ఆపుతుంటే డ్రైవర్లు కూడా ఆపడం లేదు.
ఆర్‌ఎం: మా సిబ్బందికి గట్టిగా చెబుతానమ్మా. మీరు కూడా మీ లెక్చరర్‌లకు చెప్పండి. నేను కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. (మరొకరితో) నీపేరేంటమ్మా? బస్సులు సరిపోతున్నాయా?
ప్రయాణికురాలు : తులసీమహాలక్ష్మి, మాది గంగవరం మండలం బయ్యనపల్లి సర్. గంగవరం, బయ్యనపల్లి రోడ్డు బాగానే ఉన్నా బస్సులు మాత్రం తిరగడం లేదు. మా గ్రామానికి కూడా బస్సు తిప్పాలి. గోకవరం నుంచి గంగవరం బస్సులు పెంచాలి.
ఆర్‌ఎం : సర్వే చేయించి ప్రయాణికులు ఎక్కువ ఉంటే బస్సు పంపుతాం. (మరొకరితో) నీ పేరేమిటమ్మా?
ప్రయాణికురాలు : సత్యవతి అండీ. రాజమండ్రి నుంచి రంపచోడవరం డెరైక్టు బస్సులు తక్కువ. రంపచోడవరం -రాజమండ్రి టూ స్టాప్ సర్వీసులు తిప్పాలి.
ఆర్‌ఎం : ప్రయాణికుల సంఖ్య బాగుంటే మరిన్ని బస్సులు నడుపుతాము.
ఆర్‌ఎం (గోకవరం బస్ కాంప్లెక్స్‌లో) : నీ పేరేమిటమ్మా, సాయంత్రం, రాత్రిపూట బస్సులు ఎలా ఉంటున్నాయి?
ప్రయాణికురాలు : జ్యోతి సార్. మాది రంపచోడవరం. రాత్రి ఎనిమిదిన్నర, తొమ్మిది మధ్యలో బస్సులు అసలు ఉండడం లేదు. గోకవరం బస్టాండ్‌లో, రాజమండ్రిలో చెప్పుకున్నా ఏమీ జరగడం లేదు.
ఆర్‌ఎం : ఆరు దాటాక మరో రెండు బస్సులు తిరుగుతున్నాయి. అవి సరైన సమయాల్లో తిరిగేలా చూస్తాను. లేదంటే రాజమండ్రి వచ్చి నాకు చెప్పండి. (మరొకరితో) నీ పేరేమిటమ్మా?
విద్యార్థిని : ప్రసన్నజ్యోతి, మాది కొత్తపల్లి. గోకవరం నుంచి కాకినాడ రూట్‌లో బస్సులు సరిపోవడంలేదు. కాలేజీ వదిలాక ఇంటికి వెళ్లే సరికి రాత్రి అయిపోతోంది. ఉదయం కూడా మా కొత్తపల్లిలో 9.15, 9.30 మధ్యలో బస్సు ఉండేలా చూడాలి.
ఆర్‌ఎం : ఈ రూట్‌లో బస్సులనుపెంచేలా చూస్తామమ్మా. (మరొకరితో) అబ్బాయ్ నీ పేరేమిటి? బస్సుల కండిషన్ ఎలా ఉంది?
విద్యార్థి : సాయి మణికంఠ, మా తంటికొండ రూట్‌లో తిరిగే బస్సు సీట్లు ఎక్కడికక్కడ ఊడిపోయాయి. రెండు రోజులకోసారి టైరు పంచరై మధ్యలో ఆపేస్తున్నారు. (మరో విద్యార్థి కృప కల్పించుకుని) మాది గాజులపాలెం. మా గోపాలపురం బస్సు అద్దాలు ఊడిఎప్పుడు ఎవరి మీద గాజుముక్కలు పడిపోతాయోనని భయపడుతున్నాం. ప్లీజ్ సర్ బస్సు మార్చండి.
ఆర్‌ఎం : బస్సులు మార్చేందుకు చర్యలు తీసుకుంటాను (ట్రాఫిక్ అధికారులను బస్సు మార్చాల్సిందిగా అక్కడికక్కడే ఆదేశించారు)
ఆర్‌ఎం : ఏం అబ్బాయి, మీ ఊరుకు బస్సు వస్తుందా?
విద్యార్థి : నా పేరు మురళిదొరండీ, పూడిపల్లి వచ్చే బస్సును గొందూరు వరకూ తిప్పాలి.ఉదయం బస్సు 6.30కు వస్తోంది. కాలేజీ పిల్లలం అంత తొందరగా క్యారేజీలు సర్దుకుని రాలేక పోతున్నాం. అందుకే 7.30కు మార్చండి సర్.
ఆర్‌ఎం : బస్సు పొడిగింపు వీలు పడుతుందా అనేది పరిశీలిస్తా. సమయాలు మారుస్తాను.