బాబు మనసు విప్పేనా?
=ప్రజాగర్జన పేరిట క్యాడర్ జారిపోకుండా తంటాలు
=సమైక్యాంధ్ర ఊసేలేకుండా
=టీడీపీ ప్రజాగర్జన
=తంబళ్లపల్లె, పలమనేరు, పీలేరుల్లో పార్టీకి దిక్కులేదు
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు తిరుపతి ప్రజాగర్జన సభ ద్వారా తన మనసులోని మాట బయటపెడతారా లేక మళ్లీ పాత పాటే పాడుతూ సమన్యాయం అంటారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. టీడీపీ ప్రజాగర్జన సభ తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం జరగనుంది. ఈ సభ ఏర్పాట్లలో ఎక్కడా సమైక్యాంధ్ర నినాదాలు, ఆ భావన వచ్చే విధంగా ప్రకటనలు లేకుండా టీడీపీ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంది. చంద్రబాబు మనసులోని ఆలోచనకు అనుగుణంగానే రాష్ట్ర విభజనపై స్పష్టత ఇవ్వకుండా సభ ఉంటుందని ఎన్టీఆర్ భవన్ నుంచి జిల్లా నాయకులకు సూచనలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే తిరుపతి నగరం, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా సమైక్యాంధ్ర ప్రస్తావనే లేదు.
శ్రేణులను కాపాడుకునేందుకే
రాష్ర్ట విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడంతో జిల్లా నాయకులు సైతం ప్రజల్లోకి వెళ్లలేక లోలోపల మదనపడుతున్నారు. పార్టీ శ్రేణులు చేజారిపోకుండా ఉండేందుకే ప్రజాగర్జన పేరుతో తంటా లు పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జనసమీకరణకు తంటాలు
ప్రజాగర్జన సభ జనసమీకరణకు సంబంధించి 14 నియోజకవర్గాల్లోని జిల్లా నాయకులు, రెండవ శ్రేణి నాయకులకు కోటాలు ఇచ్చారు. ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని, ఇంకా ఖర్చు చేసే పరిస్థితి లేదని కొందరు నేతలు ముఖం చాటేస్తున్నారు. మరికొం దరు అధిష్టానం పోరు పడలేక పరిమిత సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. జనసమీకరణను జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ముద్దుక్రిష్ణమనాయుడు, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మూడు రోజుల ముందే జిల్లాకు విచ్చేసి ముఖ్యనాయకులతో సమావేశమైనా తెలుగుతమ్ముళ్లు జనసమీకరణపై పెద్దగా దృష్టి సారించలేదు. తిరుపతిలో మొన్నటి వరకు కీలకంగా ఉన్న ఒక సామాజికవర్గానికి చెం దిన నాయకుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చదలవాడ వైఖరి కారణంగా దూరంగా ఉన్నారు. సభా స్థలి వద్ద గాలి ముద్దుక్రిష్ణమనాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ జనాన్ని తరలించేందుకు తమ నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్ప డం గమనార్హం.
బాబుకు గాంధీ షాక్
మాజీ ఎమ్మెల్యే, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గాంధీ ఏకంగా చంద్రబాబు షాక్ ఇచ్చారు. చిత్తూరు ఎంపీ సీటు ఆశించి భంగపడిన ఆయన పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. జిల్లాలో ఇప్పటికే చంద్రగిరి, తంబళ్లపల్లె, పలమనేరు, పీలేరు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేరు. తాజాగా ఈ జాబితాలో జీడీ నెల్లూరు నియోజకవర్గం చేరింది.
అంతర్గత మంతనాలకే అధిక సమయం
చంద్రబాబు ప్రజాగర్జన సభకు వస్తున్నా అధిక సమయం పార్టీ అంతర్గత సమీక్షలు, చర్చలకే కేటాయించనున్నారు. బాబు ఆదివారం ఉదయం తిరుపతి చేరుకుంటారు. తర్వాత తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతిలోని ఒక హోటల్‌కు చేరుకుంటారు. ఉదయం దాదాపు రెండు గంటల సేపు నాయకులతో పార్టీ పరిస్థితిపై సమావేశం కానున్నారు. జిల్లాలో ఇప్పటికే ైవె.ఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం, ఓదార్పు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. దీనికి జనం నుంచి అనూహ్య స్పందన వస్తుండడంపై సాయంత్రం నాయకులతో వన్ టూ వన్ మీటింగ్‌లో బాబు ఆరా తీయవచ్చునని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాగర్జన అనంతరం ఇదే హోటల్‌లో బస చేసి పొద్దుపోయే వరకు నియోజకవర్గాల వారి నాయకులను పిలిచి మాట్లాడనున్నారు.
నేతల చేరికపై ఆరా
కాంగ్రెస్‌కు చెందిన మంత్రి గల్లా అరుణకుమారి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ, మరికొందరు త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశమూ బాబు వద్ద ప్రస్తావనకు రావొచ్చు. వీరిని చేర్చుకుంటే ఆయా నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్లు ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది నాయకులను ఆరా తీసే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఎన్నికల్లో పార్టీ గాడి తప్పకుండా, తమ్ముళ్లను అదుపులో ఉంచుకునేందుకే గర్జన పేరుతో బాబు తంటాలు పడుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.