
'అగ్రశేణి నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తా'
హైదరాబాద్: విశాఖపట్నంను అగ్రశేణి నగరంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. హుద్ హుద్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా పరిశ్రమ నిర్వహించిన 'మేముసైతం' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుద్ హుద్ తుపాను కారణంగా నష్టపోయిన విశాఖను పునర్ నిర్మాణం చేస్తామని అన్నారు. భవిష్యత్ లో తుపానులు వచ్చినా ఏమీ చేయనివిధంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైజాగ్ ను సుందరమైన నగరంగా తయారుచేస్తాని హామీయిచ్చారు.
రెండు ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. తుపానే అసూయపడేంతగా సినిమా పరిశ్రమ స్పందించిందని మెచ్చుకున్నారు. సినిమా పరిశ్రమ సేకరించిన విరాళాలతో ఓ మోడల్ కాలనీ అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు.
తెలుగు సినిమా పరిశ్రమ సేకరించిన 11 కోట్ల 56 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కును ఈ సందర్భంగా చంద్రబాబుకు సినిమా ప్రముఖులు అందజేశారు. మంత్రులు చింతకాల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సినిమా ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మురళీమోహన్, జయప్రద, సుమలత, కె.రాఘవేంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.