సాక్షి, పులివెందుల : తలకు గాయం ఉండటం, బెడ్ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉదయం వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లాను. ఆయన తలుపు తీయకపోవడంతో బయట కూర్చొని పేపర్ చదివా. అరగంట తర్వాత అనుమానం వచ్చి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశా. సార్ ఇంకా లేవలేదు లేపాలా? అని అడిగాను. నైట్ లేట్ గా వచ్చినట్లున్నారు.. లేపొద్దులేనని చెప్పారు. సరే అని మరో అరగంట పాటు బయటే వెయిట్ చేశా. ఇంతలో ఇంట్లో పనిచేసే లచ్చమ్మ, ఆమె కొడుకు వచ్చారు. సార్ ఇంకా పడుకునే ఉన్నారని చెప్పా. వెనక కిటికీ కొడితే లేస్తారు.. లేపండని పనిమనిషికి చెప్పా. కిటికీ కొడితే లేవలేదు.. నేను కూడా ప్రయత్నించా పలకలేదు.. గాఢ నిద్రలో ఉన్నాడని అనుకున్నాం. లేస్తాడులేనని అనుకున్నాం. మెయిన్ డోర్ మూసి ఉంది కానీ.. వెనుకున్న తలుపుకు గడియ లేదు. ఆ డోర్ ఓపెన్ అయినట్లు రంగన్న అనే వృద్ధుడు తెలిపాడు. లచ్చమ్మ కొడుకు, నేను ఇద్దరం లోపలికి వెళ్లాం. లోపలకు వెళ్లి చూడగా బెడ్‌రూమ్ తెరిచి ఉంది. బెడ్‌రూమ్ అటాచ్‌డ్ బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాను. ఆ డోర్ ఎందుకు తీసారా? అనే అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను.’ అని కృష్ణారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment