వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దు | High Court key directions about Viveka Murder Case | Sakshi
Sakshi News home page

వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దు

Published Sat, Mar 30 2019 4:19 AM | Last Updated on Sat, Mar 30 2019 4:19 AM

High Court key directions about Viveka Murder Case - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి విలేకరుల సమావేశాలు నిర్వహించరాదని ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్‌), పోలీసులను ఆదేశించింది. కేసు దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయరాదని, అలాగే లీకులు ఇవ్వడం చేయరాదని వారికి తేల్చి చెప్పింది. అదే సమయంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇటు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాలపై మాట్లాడరాదని, ఈ విషయాన్ని వారికి తెలియజేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్, వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్య హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ కేసులో తుది నివేదిక దాఖలు చేయకుండా సిట్‌ను ఆదేశించాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి, సౌభాగ్య తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ తమ తమ వాదనలను వినిపించారు.  

ఎన్నికల్లోపు సిట్‌ దర్యాప్తు 
పూర్తి చేయించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన.. 
ఈ సందర్భంగా జగన్‌ తరఫు న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో కుటుంబ సభ్యులపై నిందారోపణలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు బయటకు రావాలన్న ఉద్దేశంతోనే తాము సీబీఐ దర్యాప్తును కోరుతున్నామన్నారు. సీబీఐ దర్యాప్తును కోరడాన్ని చంద్రబాబు తప్పుపట్టారని, సీబీఐ దర్యాప్తు వల్ల ఆలస్యం జరుగుతుందని చెప్పారని, అంటే ఈ ఎన్నికల్లోపు పోలీసుల చేత దర్యాప్తు పూర్తి చేయించి, తద్వారా రాజకీయ లబ్ధిపొందాలన్నది ఆయన ఆలోచన అని మోహన్‌రెడ్డి వివరించారు.  అధికార పార్టీ కావడంతో పోలీసులను కావాల్సిన విధంగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. 

ప్రాథమిక విషయాలనే ఎస్‌పీ చెప్పారు.. 
అంతకు ముందు ఏజీ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో ప్రధానంగా సీఎం చేసిన వ్యాఖ్యల గురించి అభ్యంతరం చెబుతున్నారన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమన్నారు. వివేకానందరెడ్డి దర్యాప్తును ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పర్యవేక్షించలేదని తెలిపారు. దర్యాప్తు సంస్థ తమ దర్యాప్తును కొనసాగిస్తోందన్నారు. సీబీఐ దర్యాప్తునకు అరుదైన, అసాధారణ కేసుల్లో మాత్రమే ఆదేశించాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. వివేకానందరెడ్డి ముఖ్యమైన రాజకీయ నేతని, అతని మరణానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను బహిర్గతం చేయకపోతే ప్రజల్లో అనేక అనుమానాలకు తావిచ్చినట్లవుతుందన్నారు. అందువల్ల మరణానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను జిల్లా ఎస్‌పీ చెప్పారే తప్ప, దర్యాప్తునకు సంబంధించిన వివరాలు కాదని ఆయన కోర్టుకు నివేదించారు. 

విలేకరుల సమావేశాలు ఎందుకు పెడుతున్నారు..?
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఓ కేసు దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఆ కేసు గురించిన ఏ వివరాలనైనా ఎస్‌పీ ఎందుకు బయటకు చెప్పాలి? విలేకరులు అడిగితే చెప్పేస్తారా? ఇలా చెప్పాలని ఏ చట్టంలో ఉంది? ఆ విలేకరుల సమావేశం జరిగిన తీరును పరిశీలిస్తే, అది ప్రెస్‌ మీట్‌లా లేదు. ఎస్‌పీని కోర్టులో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసినట్లు ఉంది. ఏం ఆశించి ఎస్‌పీ ఆ విలేకరుల సమావేశం పెట్టారు? నిందితులకు ముసుగులు వేసి మీడియా ముందుకు పోలీసులు ఎందుకు తీసుకొస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఇవన్నీ లేవు. ఈ కొత్త పద్ధతులు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? కేసు దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు విలేకరుల సమావేశాలు ఎందుకు పెడుతున్నారు?’ అంటూ ఘాటు స్వరంగా ప్రశ్నించింది.  

పిల్‌ను ఉపసంహరించుకోండి.. 
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, అనిల్‌కుమార్‌ దాఖలు చేసిన పిల్‌పై అటు జగన్, సౌభాగ్య, ఇటు ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని, కాబట్టి పిల్‌ను ఉపసంహరించుకోవడం ఉత్తమమని తెలిపింది. ఇందుకు అనిల్‌కుమార్‌ న్యాయమూర్తి అంగీకరించడంతో ఆ మేర ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏజీ ప్రస్తావనతో తిరిగొచ్చిన సీనియర్‌ న్యాయవాదులు.. 
అందరి వాదనలు విన్న ధర్మాసనం, సోమవారం మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయం వెలువరిస్తామంది. ఈ సమయంలో మోహన్‌రెడ్డి స్పందిస్తూ, అప్పటి వరకు తుది నివేదిక దాఖలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ సమీప కాలంలో తుది నివేదిక దాఖలు చేసే అవకాశం లేదని, ఇది తన హామీ అని ఏజీ చెప్పారు. సోమవారానికి విచారణ వాయిదా పడటంతో ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు హైదరాబాద్‌ వచ్చేందుకు నేలపాడు విడిచి సగం దూరం వచ్చారు. ఆ వెంటనే అడ్వొకేట్‌ జనరల్‌ మళ్లీ ధర్మాసనం వద్దకు వచ్చి, సోమవారం ఉత్తర్వులు జారీ చేయవద్దని, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, విచారణను ఏప్రిల్‌ 8కి వాయిదా వేయాలని కోరారు. సీనియర్‌ న్యాయవాదుల వాదన వినకుండా ఏ నిర్ణయం తీసుకోలేమని, ఈ విషయాన్ని ముందు ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులకు తెలియజేయాలని ఏజీకి ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు తిరిగి హైకోర్టుకు వచ్చారు. 

కావాల్సిన వారికి లీకులిస్తున్నారు.. 
సౌభాగ్య తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, నిష్పాక్షిక దర్యాప్తు కోసమే తమ తపనంతా అని తెలిపారు. బహిరంగ సభల్లోనూ ముఖ్యమంత్రి అనేక ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. గురువారం పోలీసులు సంబంధిత కోర్టులో రిమాండ్‌ రిపోర్ట్‌ వేశారని, ఇది కూడా పత్రికలకు చేరిపోయిందన్నారు. దర్యాప్తునకు సంబంధించిన ప్రతి విషయాన్ని కావాల్సిన వారికి లీకు చేస్తున్నారని తెలిపారు. తద్వారా రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని వివరించారు.  

ప్రెస్‌మీట్లు, లీకులు వద్దు.. 
ఈ సమయంలో మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, కేవలం కేసు గురించే కాదని, హత్య ఘటన గురించి  మాట్లాడకుండా చూడాలన్నారు. అలాగే సిట్, పోలీసులను  కేసు దర్యాప్తు, హత్య ఘటన గురించి ఎటువంటి ప్రెస్‌మీట్లు పెట్టడం, ప్రెస్‌ నోట్లు ఇవ్వడం, లీకులు ఇవ్వడం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం ఆ మేర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 15కి వాయిదా వేసింది.

ఇద్దరి హామీ నమోదు..
కొద్దిసేపటి తరువాత ఏజీ వచ్చి, ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని ముఖ్యమంత్రికి తాను సలహా ఇస్తానని, తన సలహాను ఆయన గౌరవిస్తారని చెప్పారు. తానూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సలహా ఇస్తానని, అసలు ఈ కేసు గురించి మాట్లాడరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసినా తమకు అభ్యంతరం లేదని, ఆ ఆదేశాలను తాము పాటిస్తామని మోహన్‌రెడ్డి వివరించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం, ఈ కేసు గురించి మాట్లాడవద్దని ఇరువురు నేతలకు చెప్పాలని మోహన్‌రెడ్డికి, ఏజీ శ్రీనివాస్‌కు సూచించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement