మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్‌ | Vizag gas leak: CM YS Jagan Announces Rs 1 crore compensation | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్‌

Published Thu, May 7 2020 3:03 PM | Last Updated on Thu, May 7 2020 6:28 PM

Vizag gas leak: CM YS Jagan Announces Rs 1 crore compensation - Sakshi

సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘తెల్లవారు జామున గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల గ్రామాలపై ప్రభావం చూపింది. గ్యాస్ ప్రభావం ఐదు గ్రామాలపై ఉంది. ఘటనపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కమిటీ సూచిస్తుంది.

మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. జరిగిన దుర్ఘటనలో చనిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా... మనసున్న మనిషిగా బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థికసాయం అందచేస్తాం. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికీ రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటాం. ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం. ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తాం.

గ్యాస్‌ కారణంగా ప్రభావిత గ్రామాలు
వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ– ఎస్టీకాలనీ, నందమూరినగర్, పద్మనాభపురం గ్రామాల్లోని ప్రజలంతా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ గ్రామాల్లోని దాదాపు 15వేలమంది ఉంటారని చెప్తున్నారు. వీరందరికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు ఇస్తున్నా. మెడికల్‌ క్యాంపులు పెట్టమని కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నాం. గ్రామాలకు వెళ్లలేని వ్యక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేసి మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. కమిటీ రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల పాటు చీఫ్‌ సెక్రటరీ, ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడే సహాయ కార్యక్రమాలకు పర్యవేక్షణ చేస్తారు. ఈ గ్రామాలకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకోమని చెప్తున్నాను. (ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష)


అలారం ఎందుకు మోగలేదు?
ఎల్జీ లాంటి గుర్తింపు ఉన్న సంస్థలో ఇలాంటి దుర్ఘటనలు జరగటం బాధాకరం. గ్యాస్‌ లీక్‌ అయినప్పుడు అలారం ఎందుకు మోగలేదో తెలియరాలేదు. తెల్లవారు జామున ఘటన జరిగినప్పుడు ప్రమాద హెచ్చరిక ఎందుకు రాలేదు. హెచ్చరికలు లేకపోవడం అన్నది దృష్టి పెట్టాల్సిన అంశం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించారు. వారిని అభినందిస్తున్నా. ఉదయం నాలుగు గంటల నుంచే కలెక్టర్‌, సీపీ సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అంబులెన్సులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, వాటి ద్వారా దాదాపు 348 మందిని అన్ని ఆస్పత్రుల్లో చేర్పించారు. పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నవారు కూడా ... ఇప్పుడు వెంటిలేటర్‌ కూడా అవసరం లేని స్థాయికి చేరుకున్నారు’ అని తెలిపారు. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకై తొమ్మిదిమంది మృతి చెందగా, సుమారు 200మంది అస్వస్థతకు గురయ్యారు.(గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement