అతడే ఒక సైన్యం | Volunteers are Working Good In Andhra Pradesh For Covid-19 Prevention | Sakshi
Sakshi News home page

అతడే ఒక సైన్యం

Published Sun, Mar 22 2020 4:44 AM | Last Updated on Sun, Mar 22 2020 8:30 AM

Volunteers are Working Good In Andhra Pradesh For Covid-19 Prevention - Sakshi

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌:  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది వలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనప్పటికీ సేవా భావంతో పని చేసే యువతకు వలంటీర్లుగా అవకాశం కల్పించారు. వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ఇతరత్రా అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని అప్పట్లో సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటారు. వారి ద్వారా ప్రజలకు సేవలు అందాలన్నా, ఎవరినైనా గుర్తించాలన్నా కొంత సమయం పడుతుంది. అయితే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ను నియమించడం వల్ల అన్ని విధాలా లాభం ఉందనే విషయం కరోనా వైరస్‌ కట్టడి విషయంలో స్పష్టమైంది. ముఖ్యమంత్రి వలంటీర్లను నియమిస్తూ.. ‘మీరంతా నా ప్రతినిధులు.. ప్రజల ముంగిటకు పాలనను తీసుకెళ్లడంలో మీ పాత్ర కీలకం’ అని చెప్పారు. సీఎం మాటలను వారు వమ్ము చేయకుండా అంకిత భావంతో పని చేస్తున్నారు. గత రెండు నెలలుగా ఒక్క రోజులో కొద్ది గంటల వ్యవధిలో సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే అందజేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా విదేశాల నుంచి వచ్చిన వారిని వేగంగా గుర్తించి,  89 శాతం మందికి పరీక్షలు చేయించడం అంటే ఆషామాషీ కాదు. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి ఒక్కో వలంటీర్‌ ఒక సైనికుడిలా ముందుకు కదులుతున్నాడు.  

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన 3 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో ఒకరు ఇటలీ నుంచి, ఇంకొకరు లండన్‌ నుంచి, మరొకరు సౌదీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తులే. కరోనా లక్షణాలు కనిపించిన వారు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. వీరిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి వలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపకరించింది. ఈ స్థాయిలో త్వరితగతిన ఏ రాష్ట్రంలో కూడా సేవలందలేదనడం అతిశయోక్తి కాదు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడం తెలిసిందే. వైరస్‌ను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యలను కూడా సీఎం వివరించారు. 

ఆ కుటుంబంపై నిరంతరం నిఘా 
మా గ్రామానికి చెందిన ఓ యువకుడు హోటల్‌ మేనేజ్‌ మెంట్‌ చదువు కోసం రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా వెళ్లాడు. కరోనా నేపథ్యంలో పది రోజుల క్రితం గ్రామానికి రాగానే సమీపంలోని దేవుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణికి సమాచారం అందించాను. అతనితో పాటు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయించాము. వారందరినీ 14 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండాలని సూచించాము. రోజూ వారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు. 
– కొమ్మోజు స్వాతి, గ్రామ వలంటీర్, కొత్తపాలెం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా

108 వాహనంలో ఆసుపత్రికి తరలించాం 
మా గ్రామానికి చెందిన ఓ మహిళ జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి గత మంగళవారం గ్రామానికి చేరుకుంది. ఆమెకు దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలు ఉన్నట్టు గుర్తించాం. ఆస్పత్రికి తీసుకెళదామనుకుంటే కరోనా వైరస్‌ సోకి ఉంటుందనే భయంతో గ్రామస్తులు సందేహించారు. నాతో పాటు ఆశ వర్కర్‌ తోడేటి అంకేశ్వరి, సచివాలయ ఏఎన్‌ఎం రాఘవ రాణితో కలిసి 108 వాహనాన్ని రప్పించాం. ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించాం.  
 – మామిడి శ్రీకాంత్, వలంటీరు, మురగళ్ల, ఆత్మకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

ఎవరికి ఏ కష్టమొచ్చినా మాకు తెలుస్తుంది
ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని వెంటనే సేకరించి ఇస్తున్నాం. కరోనా వైరస్‌ బారిన పడిన వారిని గుర్తించడంలో నిమగ్నమయ్యాం. ఇప్పటికే రెండు విడతలుగా ఇంటింటి సర్వే పూర్తి చేశాం. పింఛన్లు, రేషన్‌ సరుకులు సకాలంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే తీసుకువెళ్లి అందిస్తుండటంతో ప్రజలందరూ పరిచయమయ్యారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా మాకు వెంటనే తెలుస్తుంది.  
–  ఎస్‌.శారద, 6వ డివిజన్‌ వలంటీరు, శ్రీకాకుళం  

ఆర్డీటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించా
మా ఊరికి చెందిన ఓ వ్యక్తి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. తీవ్ర జలుబుతో గ్రామానికి వచ్చాడు. వెంటనే విషయం తెలుసుకుని అతని ఇంటి వద్దకు వెళ్లాను. కళ్యాణదుర్గం ఆర్‌డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాం. రెండు వారాల పాటు ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచించా. కొత్త వారి పట్ల అప్రమత్తంగా ఉంటున్నాం.
 – లావణ్య, గ్రామ వలంటీర్, బసాపురం, కుందుర్పి మండలం, అనంతపురం జిల్లా  

ఆమెను ఐసోలేషన్‌లో ఉంచాం
ఇటీవల మలేషియా నుంచి ఓ మహిళ తిరుపతికి వచ్చింది. 47వ వార్డు సత్యనారాయణ పురం పరిధిలో ఆమె ఉంటున్నట్లు హెల్త్‌ సెక్రటరీ ద్వారా గుర్తించాం. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడమే కాకుండా విపత్తు సమయాల్లోనూ మా వంతు విధులు నిర్వర్తిస్తున్నాం.     
– గిరిప్రసాద్, వలంటీర్‌ 47వ సెక్రటేరియేట్, తిరుపతి.

ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం
సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంతో పాటు.. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో మేము భాగస్వాములు కావడం సంతోషం కలిగిస్తోంది. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారిపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిస్థితిని మాపై అధికారులకు చేరవేస్తున్నాం. 
– పాదర్తి రవితేజ, వలంటీర్, గురజాల, గుంటూరు జిల్లా

విస్తృత ప్రచారం చేస్తున్నాం
కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం చేస్తున్నాం. మా పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్య పరుస్తున్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నాం. జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉంటే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నాం. గోరువెచ్చని నీటిని తాగాలని చెబుతున్నాం.
– రాజ్‌కుమార్, వలంటీర్, తాళ్లరేవు, తూర్పు గోదావరి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement