= జిల్లాలో 100కు పైగా బస్సులు
=రోజుకు 5000 మంది ప్రయాణం
= హడలెత్తిపోతున్న ప్రయాణికులు
సాక్షి, విజయవాడ : మొన్న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద... నిన్న కర్ణాటకలోని కునిమల్లహళి... వద్ద జరిగిన వోల్వో ప్రమాదాల్లో 50 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో వోల్వో బస్సులో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. అసలు వోల్వో బస్సు తయారీలోనే లోపం ఉందా? లేక యాజమాన్యాల ధనదాహం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయా? తెలియక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో ప్రతి రోజూ 5వేలకు మందిగా పైగా వోల్వో బస్సుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. వారాంతం, పండుగ రోజుల్లో ఈ సంఖ్య మరో వెయ్యి పెరగవచ్చు. ఈ నేపథ్యంలో వోల్వోబస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు భద్రతెంత? అని అధికారులను ప్రశ్నిస్తే... మౌనమే సమాధానంగా వస్తోంది.
100కు పైగా బస్సులు...
జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీలో 25 వోల్వో బస్సులు ఉండగా, ప్రైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో 90 బస్సులున్నాయి. ఇసూజీ, వోల్వో కంపెనీలు రూ.80 నుంచి కోటి 20లక్షలు ఖరీదు చేసే వోల్వో బస్సులు తయారు చేస్తున్నాయి. గంటకు 120 నుంచి 140 కి.మీటర్లవేగంలో బస్సుల్ని నడపవచ్చని వాటి డ్రైవర్లు చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం వల్ల అంత వేగంతో వెళుతున్నప్పటికీ డ్రైవరుకు కానీ, బస్సులో ప్రయాణికులకు కానీ ఏ మాత్రం కుదుపు ఉండదంటున్నారు. దీంతో ఎంతో ధీమాగా ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రమాదం జరిగినప్పుడు తేరుకునేలోగానే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులకు ప్రథమ చికిత్స చేసేందుకు కావాల్సిన వైద్యపరికరాలు వోల్వో బస్సుల్లో ఉండటం లేదు.
వోల్వోల్లో భద్రతశూన్యమే!
రవాణాశాఖ నిబంధనల ప్రకారం ఏ బస్సులైనా 65 కి.మీటర్లు వేగం మించి వెళ్ల కూడదు. అయితే మన జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ వోల్వో బస్సులు 80 నుంచి 90 కి.మీటర్లు వేగంతోనూ, ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సులు 120 నుంచి 140 కి.మీటర్లు వేగంతో వెళుతున్నాయని అధికారులు అంగీకరిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు 120 కి.మీ కంటే వేగంగా వెళ్లుతున్న బస్సులే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వోల్వో కంపెనీల బస్సులకు స్పీడ్‌లాక్ ఏర్పాటు చేసినా ప్రైవేటు ఆపరేటర్లు వాటిని తొలగించి వేగాన్ని విపరీతంగా పెంచేస్తున్నారని చెబుతున్నారు. ప్రైవేటు బస్సులతో పోటీపడుతూ ఆర్టీసీ అధికారులు నిబంధనలను పక్కన పెట్టి వోల్వో బస్సులను నడుపుతున్నారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.
వోల్వోలో భద్రత డొల్లేనా?
Published Sat, Nov 16 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement