గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:
తెలుగుజాతికి పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ చేసిన ద్రోహాన్ని ప్రజలు ఎన్నటికీ మరచిపోరని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత, సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య చెప్పారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటు ఆయుధంతో ప్రజలు మర్చిపోలేని గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ఆపి తీరుతామని ప్రగల్భాలు పలికిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు లోక్‌సభలో స్పీకర్ వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారే తప్ప బిల్లు ప్రతులను చించి వేసి, అక్కడికక్కడే రాజీనామాలు చేయలేదేమని ప్రశ్నించారు. విభజనతో నష్టపోయే ప్రాంత ఎంపీలను లోక్‌సభ నుంచి బహిష్కరించి దొడ్డిదారిలో బిల్లును ఆమోదింపజేసుకోవడం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. గాంధీ మార్గంలో 200 రోజులకు పైబడి చేసిన ఉద్యమంలో ఎక్కడా విధ్వంసానికి పాల్పడలేదని, గాంధీ వారసులమని చెప్పుకునే నియంతలే రాష్ట్రాన్ని రెండుగా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌పార్టీని 20 ఏళ్ళ పాటు అధికారానికి దూరం చేయాలన్నారు. ఇప్పటి వరకూ సమైక్యాంధ్ర కోసం చేసిన కృషి, పోరాట స్ఫూర్తి, పట్టుదలను ఇకపై ఈ ప్రాంత అభివృద్ధిలో చూపి యుద్ధ ప్రాతిపదికన జాతీయస్థాయి పరిశోధన సంస్థలు, విద్య, వైద్య పరిశోధన సంస్థలు నెలకొల్పేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో వెళ్ళే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్ళే ప్రసక్తి లేదన్నారు. సీఎం పార్టీ పెడితే దానిలో చేరే విషయమై ఆలోచించి, నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కలిసి పార్లమెంటులో రాష్ట్ర విభజన నాటకాన్ని రక్తి కట్టించాయని, వీరి నాటకం వీధి బాగోతాన్ని తలపించిందన్నారు. స్వార్థ కాంగ్రెస్, బీజేపీ నాయకులను సీమాంధ్ర నుంచి బహిష్కరించి మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి పరుచుకుందామన్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం, సంప్రదాయాలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. విలేకరుల సమావేశంలో సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, విద్యాసంస్థల జేఈసీ ప్రతినిధులు కేవీ శేషగిరిరావు, ఆర్. రాము తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతోనే గుణపాఠం
Published Thu, Feb 20 2014 1:53 AM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM
Advertisement