ఓట్లు పెరిగాయి
విజయనగరం గంటస్తంభం : పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తుది ఓటర్ల జాబితా ఖరారైంది. తాజా జాబితా ప్రకారం జిల్లాలో 34,634 మంది ఓటర్లున్నారు. గతంతో పోల్చి చూస్తే 66 ఓట్లు పెరిగాయి. నోటిఫికేషన్ వరకు చేర్పులకు అవకాశం ఇవ్వడం, సక్రమంగా లేకపోవడంతో కొన్ని ఓట్లు తొలిగించడంతో జాబితా స్వల్పంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చి 9న ఎన్నికలు జరగనున్న విషయం విధితమే.
ఇప్పటికే నామినేషన్ల పక్రియ ముగియగా, ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు ఖరారు చేశారు. వాస్తవానికి ఓటర్ల జాబితా తయారీ కార్యక్రమం అక్టోబర్‌లో మొదలుకాగా, జనవరి 12వ తేదీతో ముగిసింది. అప్పట్లో ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో 34,570 మంది ఓటర్లున్నారు. అయితే ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే వరకు ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదుకు అవకాశం కల్పించడంతో ఓటర్ల సంఖ్య మరి కాస్త పెరిగింది.
కొత్తగా చేరినవి 405
నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో 430 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో అన్ని ధ్రువపత్రాలు సమర్పించిన 405 మందిని ఓటర్లుగా అవకాశం కల్పించడంతో మొత్తం సంఖ్య 34,975కు చేరింది. అయితే చాలామంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారన్న ఆరోపణలు రావడంతో అధికారులు మళ్లీ విచారణ చేపట్టి 341 బోగస్ ఓటర్లను తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 34,634కు చేరింది. ఇందులో పురుషులు 24,391 మంది ఉండగా, స్త్రీలు 10,243 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓట్లు అసలు నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ జాబితాను అధికారులు అభ్యర్థులకు అందజేస్తున్నారు. ఈ జాబితా ఆధారంగానే మార్చి 9న ఎన్నికలు జరగనున్నాయి.