తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓటర్ల ధర్నా
మాడ్గుల, న్యూస్‌లైన్: సమాచారం ఇవ్వకుండా అర్హులైన 150 మంది పేర్లను ఓటరు జాబితానుంచి తొలగించారని ఆరోపిస్తూ మాడ్గుల మండలం అవురుపల్లి ఓటర్లు సర్పంచ్ నారాయణగౌడ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అధికారుల చర్యని నిరసిస్తూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని బయటకు పంపించి,దాన్ని మూసివేసి అక్కడే ధర్నాకు దిగారు. సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ శ్రీనివాసురెడ్డి తాను పోలింగ్ బూత్‌ల పరిశీలనలో ఉన్నానని, 12 గంటలకు వస్తానని చెప్పారు. దీంతో అప్పటి వరకు ఓటర్లు కార్యాలయం ముందే బైఠాయించారు. కాసేపటికి తాను వచ్చేందుకు వీలుకాదని వినతి పత్రాన్ని డీటికి ఇచ్చి వెళ్లాలని తహశీల్దార్‌నుంచి సమాధానం వచ్చింది. దీంతో ఆందోళనకు దిగినవారు మరింత ఆగ్రహానికి గురై అక్కడే వంటావార్పు చేపట్టారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ క్రమంలో 4 గంటలకు తహశీల్దార్ శ్రీనివాసురెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఓటర్లు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన నుంచి సానుకూల సమాధానం రాకపోవడంతో సర్పంచ్ నారాయణగౌడ్ తహశీల్దార్ కార్యాలయం పైకి ఎక్కి కిందకు దూకడానికి ప్రయత్నించారు.
ఇది గమనించిన కానిస్టేబుల్ ప్రభాకర్‌రెడ్డి సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చేవరకు తాము కదిలే ప్రసక్తే లేదని తహశీల్దార్ చుట్టూ బైఠాయించి ఆయనను నిర్భందించారు. ఈ విషయం తెలుసుకున్న మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం డిప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారి అమరేందర్ 6.15 గంటలకు కార్యాలయానికి వచ్చారు.ఆయనకు సర్పంచ్ నారాయణగౌడ్, భాదితులు తమకు జరిగిన అన్యాయం వివరించారు.భాద్యులైన తహశీల్దార్, వీఆర్వోలను సస్పెండ్ చేయాలని వారు ఫిర్యాదు చేశారు.
గ్రామంలో గ్రామసభ పెట్టి ఉన్నతాధికారులతో విచారణ చేయించి, అర్హులైన వారి పేర్లను జాబితాలో యదావిధిగా చేర్చుతామని ఎంజీఎల్‌ఐ డిప్యూటీ కలెక్టర్, ఎన్నికల అధికారి అమరేందర్ హామీ ఇవ్వడంతో వారు శాంతించి, వెనుదిరిగారు. ఈ ధర్నాకు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్రాంరెడ్డి, టీడీపీ జిల్లా నాయకులు రవితేజ, కృష్ణారెడ్డి, మండల ప్రధానకార్యదర్శి జగ్‌పాల్‌రెడ్డిలు సంఘీభావం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు నర్సింహ్మాగౌడ్, కాంగ్రెస్ నాయకులు యాదయ్యగౌడ్‌తదితరులు పాల్గొన్నారు.
జాబితా రభస
Published Fri, Jan 24 2014 3:23 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement