ఆ ఇరువురు డీసీసీబీ డెరైక్టర్లను అర్హులుగా తేల్చిన హైకోర్టు
డీసీఓ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీర్పు అర్హత సాధించిన
ఇన్‌చార్జి ఛైర్మన్ఆంజనేయులు
రేపే ఛైర్మన్ ఎన్నికకు ఓటింగ్
సాక్షి ప్రతినిధి, కడప : డీసీసీబీ ఛైర్మన్ ఎన్నికలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. డీసీఓ అనర్హులుగా ప్రకటించిన ఇరువురు డెరైకర్లను హైకోర్టు అర్హులుగా ప్రకటించింది. ఎలాగైనా సరే డీసీసీబీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని టీడీపీ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వచ్చింది. అంతా సవ్యంగా సాగుతోంది.. చైర్మన్ పదవి సొంతం చేసుకోవచ్చని భావిస్తున్న దశలో కోర్టు తీర్పుతో వారిలో టెన్షన్ పెరిగింది. డెరైక్టర్ల పదవులు రద్దయిన ఇరువుర్ని అర్హులుగా హైకోర్టు నిర్ణయించింది. వారిలో ఒకరైన డెరైక్టర్ చిన్న ఓబులేసు ఆకస్మికంగా మృతి చెందారు. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన డెరైక్టర్లు 8 మంది ఉండగా, టీడీపీకి మద్దతుగా 7 మంది నిలుస్తున్నారు.
డీసీసీబీ ఛైర్మన్‌గా ఉన్న ఇరగంరెడ్డి తిరుపేలురెడ్డిని అధికార యంత్రాంగం అనూహ్యంగా పదవీచ్యుతున్ని చేసింది. అధికారపార్టీ నేతల ఒత్తిడి మేరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తిరుపేలురెడ్డి కనీస వివరణ కోరకుండా గంటల్లో నిర్ణయాలను అమలు చేశారు. అదే రీతిలో వైస్ ఛైర్మన్ ఆంజనేయులు మరో డైరె క్టర్ చిన్న ఓబులేసుల పదవులు రద్దు చేస్తూ డీసీఓ పోమేనాయక్ ఉత్తర్వులు ఇచ్చారు. వారు డీసీఓ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోఆ ఇరువురు డెరైక్టర్లు ఛైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నెన్నో మలుపులు..
డీసీసీబీ ఛైర్మన్‌గా తిరుపేలురెడ్డి ఎన్నికయ్యేనాటికి ఆయనతోసహా 20 మంది డెరైక్టర్లు ఉన్నారు. వారిలో జమ్మలమడుగు చెందిన ఓ డెరైక్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మిగిలిన 19 మందితో పాలకమండలి కొనసాగుతూ వచ్చింది. వారిలో తిరుపేలురెడ్డి పదవిని అధికార యంత్రాంగం రద్దు చేసింది. ఉన్న 18 మందిలో ఇరువురి పదవుల్ని రద్దు చేస్తూ డీసీఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఇరువుర్ని అర్హులుగా హైకోర్టు ప్రకటించింది.
వారిలో ఒకరైన సరస్వతిపల్లె సొసైటీకి చెందిన డెరైక్టర్ చిన్న ఓబులేసు ఆకస్మికంగా బుధవారం మృతి చెందారు. మిగిలిన 17మంది డెరైక్టర్లలో 6 మంది మాత్రమే టీడీపీ మద్దతుదారులుగా ఉన్నారు. ఓబులవారిపల్లెకు చెందిన ఒక డెరైక్టర్ టీడీపీ శిబిరంలో చేరిపోయారు. దాంతో వారి సంఖ్య 7కు పెరిగింది. వారంతా కర్నూలు జిల్లాలో ప్రత్యేక శిబిరంలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 10 మంది డెరైక్టర్లు ఉన్నారు. 8 మంది ఇప్పటికే ప్రత్యేక శిబిరంలో ఉన్నారు.
ఇరువురు డెరైక్టర్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి అనుచరులు. ఆ ఇరువురు ఆయన పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. డీసీసీబీ ఛైర్మన్ పదవి దక్కించుకునేందుకు కావాల్సిన మెజార్టీ డెరైక్టర్లు ఇప్పటీకి తమ ఆధీనంలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
రేపే ఛైర్మన్ ఎన్నిక...
డీసీసీబీ ఛైర్మన్ తిరుపేలురెడ్డి పదవి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎన్. ఆంజనేయులు యాదవ్ డీసీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సహకారశాఖ చట్టంలోని లొసుగుల ఆధారంగా ఇన్‌ఛార్జి ఛైర్మన్ ఆంజనేయులు పదవిని రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పాలకమండలిని ఏర్పాటు చేయాలని కోరడంతో ఆమేరకు మే 2న (శనివారం) ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంజనేయులు యాదవ్ హైకోర్టును ఆశ్రయించడంతో ఛైర్మన్ ఎన్నికలో ఓటింగ్‌కు అర్హత కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. శనివారం ఛైర్మన్ ఎన్నికలను నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వ్రతంచెడ్డా ఫలితం దక్కుతుందా అన్న ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు ఈ ఎన్నికల్లో మరోమారు బహిర్గతం కానున్నట్లు పరిశీలకులు వివరిస్తున్నారు.
ఉత్కంఠ!
Published Fri, May 1 2015 5:28 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement