
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం వద్ద గవర్నర్ దంపతులు
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా తిరుమలకు వస్తున్న భక్తుల కోసం టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం తిరుమలలో పరిశీలించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి చేసిన ఏర్పాట్లు బాగున్నా యని అధికారులను ప్రశంసించారు. నారా యణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు పంపిణీ చేస్తున్న ఉప్మాను రుచి చూసి భేషుగ్గా ఉందని చెప్పారు.
నారాయణగిరి ఉద్యాన వనాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగు దొడ్ల వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన షెడ్లను గవర్నర్ పరిశీలించి అక్కడున్న భక్తులతో ముచ్చటించారు. గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. షెడ్లలో వేచి ఉన్న భక్తులకు తప్పకుండా వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుందని, తమ వంతు వచ్చే వరకు భక్తులు ఓర్పుతో ఉండి టీటీడీకి సహకరించాలని సూచించారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు.