చంద్రబాబు నాయుడు
వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
12వ తేదీలోగా ఆరు సరుకులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్
స్వచ్ఛాంధ్ర కోసం 18న పాదయాత్ర
సాక్షి. హైదరాబాద్: రుణ మాఫీ మొత్తాన్ని ఈ నెల 12వ తేదీలోగా రైతు ఖాతాలకు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులతో సమీక్షించారు. రెండో విడత రుణ మాఫీ జాబితాను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో బ్యాంకర్లు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవ ను ప్రజల్లోకి తీసుకె ళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్వచ్ఛాంద్ర, స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ వార్డులుగా రూపుదిద్దుకునేందుకు స్మార్ట్ ప్రాతిపదికగా 20 అంశాలను రూపొందించామని, వివరాలన్నీ ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బోర్డుల్లో పొందుపరిచేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రాష్ట్రంలోని 670 మండలాల్లోని 12,918 గ్రామ పంచాయతీలు, 113 మున్సిపాలిటీల పరిధిలోని 3,465 వార్డులు స్వచ్ఛత దిశగా సాగేందుకు ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు.
జన్మభూమిలో 95 అంశాలకు చెందిన ప్రతిపాదనలు సేకరించామని, ఇందులో 27 ప్రధాన అంశాలను గుర్తించి కలెక్టర్లకు పంపినట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఆయా జిల్లా కలెక్టర్లు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. కళాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వృద్ధ కళాకారుల పింఛన్లను రూ. 500 నుంచి 1,500లకు పెంచామని, ఈ మొత్తాన్ని 12వ తేదీలోగా చెల్లించాలన్నారు. వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లను 12వ తేదీలోపు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇసుక రవాణాలో సగటున 50 వేల క్యూబిక్ మీటర్ల అవసరం ఉంటుందని, అవసరమైతే చిన్న చిన్న ర్యాంపులను కూడా వినియోగంలోకి తెచ్చి ఆ ప్రాంత ప్రజలకు రవాణా ఛార్జీల భారం పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా 18న చేపట్టనున్న పాదయాత్రలో ఏ జిల్లా నుండి అనేది త్వరలోనే ప్రకటిస్తానని సీఎం తెలిపారు.