విశాఖపట్నం రైల్వేస్టేషన్
విశాఖపట్నం: కొన్నాళ్లు ఆగ్నేయ రైల్వేలో. అది కూడా కలకత్తా హెడ్‌క్వార్టర్‌గా!! ఆ తరవాతేమో తూర్పు తీర రైల్వేలో. భువనేశ్వర్ ప్రధాన కార్యాలయంగా!!. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను జోనల్ ప్రధాన కార్యాలయంగా చేయాలని... లేనిపక్షంలో తెలుగు ప్రాంతాలన్నీ కలసి ఉండే దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలని అప్పట్లో ఎన్నెన్నో ఉద్యమాలు. మరెన్నో డిమాండ్లు. ఆఖరికి పార్టీలకతీతంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధులంతా ఒకే వేదికపైకి వచ్చి మరీ నినదించినా ఫలితం లేదు.
ఇపుడు రాష్ట్ర విభజన జరిగి సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రైల్వే జోన్ ఏర్పడుతున్న తరుణంలోనూ వివక్షే. కొత్తగా ఏర్పడుతున్న జోన్‌ను ప్రధాన కార్యాలయంగా చేయడానికి విశాఖ డివిజన్‌కు అన్ని అర్హతలు ఉన్నా దాన్ని పక్కనపెడుతున్నారనేదే స్థానికుల ఆవేదన. ఈ మేరకు రైల్వే శాఖ, ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సంకేతాలను ప్రస్తావిస్తూ... ఆదాయం, మౌలిక సదుపాయాల పరంగా అగ్రస్థానంలో ఉన్న విశాఖనే జోనల్ కేంద్రంగా చేయాలని వారు చెబుతున్నారు. ఆ వివరాల సమాహారమే ఈ కథనం.
విశాఖ డివిజన్‌ను జోనల్ ప్రధాన కార్యాలయంగా చేయాలంటూ దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం... రాష్ట్ర విభజన నేపథ్యంలో జోన్ కోసం వాల్తేర్ జోనల్ సాధన కమిటీ పేరిట మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అన్ని పార్టీలూ మద్దతునిచ్చాయి. ఇలా పోరాడిన బీజేపీ, టీడీపీలే ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. అలాంటిది ఈ తరుణంలోనైనా జోన్ కల సాకారం కానట్లయితే భవిష్యత్తులో ఏ పార్టీ నేతలనూ విశాఖ ప్రజలు నమ్మటం కష్టమే. తమను గెలిపిస్తే విశాఖను జోనల్ కేంద్రంగా చేసి పువ్వుల్లో పెట్టి అప్పగిస్తామన్న ప్రజాప్రతినిధులు ఇకనైనా చొరవ చూపాలన్నది వారి మాట. రైల్వే జోన్ ఒక్కటే కాదు..దువ్వాడ మీదుగా తరలిపోతున్న రైళ్లను విశాఖకు రప్పించటం కూడా కలగానే మిగులుతోంది.
ఎప్పుడూ అన్యాయమేనా...!
ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ది సుదీర్ఘ చరిత్ర. బ్రిటిష్ కాలంలో బీఎన్నార్ రైల్వేస్, ఆ తర్వాత సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్‌లో వాల్తేరు దారుణంగా నష్టపోయింది. ఉద్యోగాల్లోనూ, ఉపాధిలోనూ, ఒడిశా, బెంగాల్ వారిదే హవా. ఇప్పటికీ కాంట్రాక్టులన్నీ వారివే. ఆఖరికి ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించాలనుకునే తెలుగు వారిని భువనేశ్వర్‌లో హాల్‌టికెట్లను చించేసి తరిమిన సందర్భాలూ కోకొల్లలు. ఇప్పటికీ అదే పరిస్థితి. పైగా కొత్త రైళ్లు, అదనపు బోగీలు, ప్రత్యేక రైళ్లన్నీ ఒడిశా పట్టాలెక్కుతున్నాయి. ఒడిశా ప్రజాప్రతినిధులు, జోనల్ రైల్వే అధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇక్కడి ఆదాయాన్నంతటినీ ఒడిశాకు మళ్లించి అక్కడ అభివృద్ధి చేస్తున్నారని ఎన్నో ఆరోపణలున్నాయి.
దూరమే భారమా...!
వాల్తేరుకు ఆదాయంతో బాటు మానవ వనరులూ పుష్కలం. 198 ఇంజిన్ల మరమ్మతులు చేసే డీజిల్ లోకోషెడ్, 170 ఎలక్ట్రిక్ లోకో మోటివ్‌లను సరి చేసే ఎలక్ట్రికల్ లోకోషెడ్ సహా వందల ఎకరాల ఖాళీ స్థలం, రైల్వే ఉద్యోగులకు అనువైన నగర స్థలాలు, 150 పడకల రైల్వే ఆస్పత్రి, కోచింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు కన్నా ఇక్కడ అధునాతన సదుపాయాలున్నాయి. ఎన్ని ఉన్నా లాబీయింగ్ లేకపోవటమే శాపంగా మారుతోందన్నది స్థానిక నేతల మాట.
ఇతర డివిజన్ల రూట్ ట్రాక్ వివరాలు
-వాల్తేరు-1105
-విజయవాడ-958
-గుంటూరు-627
-గుంతకల్-1354
లాబీయింగ్ లేకనే..!
రాజకీయ లాబీయింగ్ లేకపోవటం వల్లే వాల్తేరు రైల్వే అన్యాయానికి గురవుతోంది. ఢిల్లీలో చక్రం తిప్పే వారు ఉత్తరాంధ్రలో కరువయ్యారు. రైల్వే జోన్ విషయమై ప్రజాప్రతినిధులు నోరు విప్పకపోవడం వల్లనే ఈ సమస్యలు.
-డి. వరదా రెడ్డి-అధ్యక్షుడు
ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్
జోన్ ఇవ్వాల్సిందే..!
వాల్తేరు కేంద్రంగా రైల్వే జోన్ కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేశాం. రాష్ట్ర విభజన తర్వాత కూడా వాల్తేరును ఈస్టుకోస్టు రైల్వేలోనే ఉంచుతారని అంటున్నారు. గతంలోనే రైల్వే సౌకర్యాల విషయంలో నష్టపోయాం. మళ్లీ నష్టపోలేం. అందుకే జోన్ కావాలి.
-ఎం. నాగేంద్ర, బీజేపీ నగర పూర్వ అధ్యక్షుడు